ఆంధ్రాలో ప్రస్తుతం ఏం జరుగుతుంది ?, జగన్ రెడ్డి పై వైసీపీ నాయకులు కొందరు తిరుగుబాట్లు చేస్తున్నారు. రాజకీయ పార్టీల్లో తిరుగుబాట్లు సహజం. మహా నాయకుడు సీనియర్ ఎన్టీఆర్ పైనే తిరగబడిన స్వార్థ నాయకులు ఉన్న గడ్డ ఆంధ్ర. అలాంటిది జగన్ రెడ్డి పై తిరుగుబాటు ఒక తిరుగుబాటా ? అని అనుకోవడానికి లేదు. కారణం.. ఈ తిరుగుబాట్లు అన్నీ ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచే ఉన్నాయి. ఈ విషయంలో జగన్ రెడ్డి గుండె నిజంగానే అదరుతుంది. కారణం.. వైసీపీకి కంచుకోట లాంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు ఇలా సడెన్ గా మారతాయని వైసీపీ అస్సలు ఊహించలేదు. ఈ తిరుగుబాట్లు జగన్ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. అసలు జగన్ పార్టీకి ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి ?, కారణం జగన్ రెడ్డే. కారణం.. జగన్ బలహీనతే.
వైఎస్ జగన్ కి ఒక బలహీనత ఉంది. తనను ఎవరు అయితే పొగుడుతారో వారిని తన భక్తులుగా నమ్ముతాడు. ఉదాహరణకు కోటంరెడ్డి వ్యవహారాన్నే తీసుకుందాం. తనలాంటి సామాన్యుడికి రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, గెలిపించిన జగనన్నను ఎప్పటికీ మరిచిపోనని ఒక సందర్భంలో కోటంరెడ్డి బహిరంగంగా ప్రకటించారు. అలాగే జీవితాంతం జగన్ వెంటే పయనిస్తానని, చనిపోతే వైసీపీ జెండా కప్పాలని, అంత్యక్రియలకు ఆయనే రావాలని భావోద్వేగ సెంటిమెంట్ కూడా ఇచ్చాడు. దాంతో ఇక కోటంరెడ్డి తన భక్తుడని జగన్ రెడ్డి గుడ్డిగా నమ్మాడు. మంత్రి పదవి అందుకే ఇవ్వలేదు. నా భక్తుడే కదా ఏమీ అనుకోడు అనుకున్నాడు జగన్. కానీ, కోటంరెడ్డి తనను పొగిడింది కేవలం మంత్రి పదవి కోసమే అనే విషయాన్ని జగన్ రెడ్డి ఆలోచించుకోలేకపోయాడు.
ఇలాంటి కోటంరెడ్డిలు ఇప్పుడు వైసీపీ పార్టీలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు వారంతా జగన్ రెడ్డి పై తిరుగుబాట్లుకు రెడీ అవుతున్నారు. మరి ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో పరిశీలిద్దాం. ఈ లిస్ట్ లో తిరుపతి, మాచర్ల, శ్రీశైలం ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలతో పాటు మర్రి రాజశేఖర్, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. నిజానికి వైఎస్సార్ కుటుంబానికి భూమన వీరవిధేయుడు. కాంగ్రెస్‌ను వీడి జగన్ సరికొత్త రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన తొలి రోజుల్లో వెంట నడిచిన ప్రపథమ నాయకుడు భూమన. కానీ, భూమన కరుణాకరరెడ్డి కోసం జగన్ రెడ్డి ఏం చేశాడు ?, అసలు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూమన కరుణాకరరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టారు.
జగన్ రెడ్డి సీఎం అయ్యాక చేసిన తొలి తప్పు భూమన కరుణాకరరెడ్డిని తన మంత్రివర్గంలో తీసుకోకపోవడం. సరే.. రెండో విడతలోనైనా భూమన కరుణాకరరెడ్డిని మంత్రిగా గౌరవించాల్సింది. కానీ జగన్ రెడ్డి అది కూడా చేయలేదు. కనీసం టీటీడీ చైర్మన్ పదవికి కూడా ఆయన నోచుకోకపోవడం గమనార్హం. గతంలో టీటీడీ చైర్మన్‌గా ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన చరిత్ర భూమనది. అయినా, జగన్ హయాంలో భూమన కరుణాకరరెడ్డికి ఆ అవకాశం కూడా దక్కలేదు. తమ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉన్న ఓ నాయకుడికి జగన్ రెడ్డి ఇచ్చిన గౌరవం ఇది. రాజశేఖర్ రెడ్డి ఈ విషయంలో జగన్ రెడ్డికి పూర్తి భిన్నంగా ఉండేవారు.
కానీ, జగన్ రెడ్డి మాత్రం తనను “ఆహా జగన్, ఓహో జగన్” అని పొగిడే వారినే ఆదరిస్తున్నాడు. అయినవాళ్లను దూరం చేసుకుంటున్నాడు. భూమన కరుణాకరరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలతో పాటు మర్రి రాజశేఖర్ లాంటి బలమైన నాయకులు జగన్ పార్టీ పై విరుచుకు పడితే.. జగన్ రెడ్డి పరిస్థితి ఏమిటి ?, రానున్న రోజుల్లో జగన్ రెడ్డి పై విమర్శలకు దిగుతున్న నాయకులు ఈ లిస్ట్ లోని వారే. అయినా జగన్ చర్యలు మొదటినుంచి నేతల్లో స్థైర్యాన్ని, నమ్మకాన్ని తగ్గించేలానే ఉంటున్నాయి. పైగా జగన్ దగ్గరికి వెళ్తే.. ఎలాంటి నాయకులు అయినా చేతులు కట్టుకుని యాచించాలట. అలాంటప్పుడు అలాంటి నాయకుడి వెంట నిజమైన నాయకులు ఎందుకు నడుస్తారు ?! ఏది ఏమైనా జగన్ రెడ్డి పతనానికి పునాదులు పై లిస్ట్ లోని వాళ్లే