క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. ఈ చిత్రానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ ఇందులో టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు ముంబయిలోని శివారు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అయితే సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ నిర్మాతలు చిత్రబృందానికి డబ్బులు చెల్లించేదట. దాంతో ఆగ్రహించిన వర్కర్లు, జూనియర్ ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు ఎక్కడి పనులు అక్కడే వదిలేసి సెట్ నుంచి వెళ్లిపోయారు. ఎఫ్‌డబ్ల్యూఐసీఈ(ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్)ను ఆశ్రయించారు.
‘మూడు నెలల నుంచి సినిమా కోసం వర్కర్లు కష్టపడి పనిచేస్తున్నారు. అయినా వారికి డబ్బులు చెల్లించడం లేదు. లైట్‌మెన్‌కు దాదాపు రూ.90లక్షలు చెల్లించాలి. జూనియర్ ఆర్టిస్ట్‌లకు రూ.20 లక్షలు ఇవ్వాలి. నిర్మాత కమల్ జైన్ అక్టోబర్ కల్లా బాకీ డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మేం కమల్‌కు ఫోన్ చేస్తున్నా కూడా ఆయన సమాధానం ఇవ్వడంలేదు. చిత్రీకరణ నిలిపివేస్తే వర్కర్లకు డబ్బులు చెల్లించేది లేదని బెదిరిస్తున్నారు. నిర్మాతలు వర్కర్ల బాధను కూడా అర్థంచేసుకోవాలి. వారికి బీమా ఉండదు. సెట్లో వారికి రక్షణ ఉండదు, భద్రతా సిబ్బంది ఉండరు. అదీకాకుండా వారికి పెట్టే ఆహారం కూడా నాణ్యమైనది ఉండదు. ఈ విషయం గురించి లేబర్ కమిటీ ఛైర్మన్ కిరిట్ సోమయ్యాను కలవాలని నిర్ణయించుకున్నాం’ అని ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అశోక్ దూబే మీడియా ద్వారా వెల్లడించారు.
‘మణికర్ణిక’ చిత్రం ఇప్పటికే ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంది. కొన్ని కారణాల వల్ల ఈ చిత్ర దర్శకుడు క్రిష్ సినిమా ఆఖరి షెడ్యూల్ సమయంలో తప్పుకొన్నారు. దాంతో దర్శకత్వ బాధ్యతలను కంగనానే తీసుకున్నారు. ఆమె దర్శకత్వంలో పనిచేయనంటూ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సోనూ సూద్ కూడా సినిమా నుంచి తప్పుకొన్నారు. జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.