బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణించి రెండు నెలలు దాటుతున్నా మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సుశాంత్ మరణం వెనుక వాస్తవాలు బయటకు రాకపోగా.. అనేక అనుమానాలు రోజుకొకటి చొప్పున వస్తున్నాయి. తాజాగా ఆయన మాజీ సిబ్బంది అంకిత్ ఆచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్య అంటూ తన సందేహాలను వెలిబుచ్చాడు. ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ సుశాంత్ మెడపై మరకలు ఉన్నాయని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకొనే మనిషి కాదని, అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నా అడ్డుచెప్పే వ్యక్తి అని అన్నాడు. అలాంటి ఆలోచనలో ఉన్నవారికి ఆత్మస్థైర్యం కల్పించే మాటలు చెప్పే వాడని అన్నారు. ఆత్మహత్య చేసుకొంటే తల్లిదండ్రులు పుట్టెడు దు:ఖంలో మునిగిపోతారని చెప్పేవాడు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకొంటారా? అని అంకిత్ ఆచార్య తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
సుశాంత్ శరీరంపై ఉన్న గాయాలు, మరకలు ఆత్మహత్యగా అనిపించడం లేదన్నారు. ముమ్మాటికి అది హత్యే అనే అనుమానం కలుగుతుందని అన్నారు. ఆయన మృతదేహానికి సంబంధించిన ఫొటోలను చూసిన తర్వాత తన పరిధిలో పరిశోధన చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఉరి వేసుకొంటే మెడ చుట్టూ U ఆకారంలో మచ్చ పడుతుందని, ఎవరైనా మెడ చుట్టూ ఏదైనా బిగిస్తే O ఆకారంలో మరకలు పడుతాయి అని అంకిత్ అనుమానం వెలిబుచ్చారు. సుశాంత్ మెడపై ఉన్న మరకలు, మచ్చలు, కమిలిన గాయాలను పరిశీలిస్తే ఆయన పెంపుడు కుక్క (ఫడ్జ్) బెల్టుతో బిగించి ఉంటారనే అనుమానం కలుగుతుందన్నారు. నేను ఆయన వద్ద పనిచేసినప్పుడు ఫడ్జ్‌ను బయటకు తీసుకెళ్లే వాడిని. ఆ పెంపుడు కుక్క బెల్టును కూడా నేను కడిగే వాడిని. సుశాంత్ మెడపై ఆ బెల్టు బకెల్ మార్క్ ఉంది. ఒకవేళ సుశాంత్ ఉరివేసుకొంటే ఉపయోగించిన ఆకుపచ్చ గుడ్డ వల్ల ఆయన మెడపై అలాంటి గుర్తులు ఉండవని అంకిత్ ఆచార్య అన్నారు. సుశాంత్‌కు నమ్మకంగా పనిచేసే వ్యక్తులను, సిబ్బందిని ఉద్యోగంలో నుంచి రియా చక్రవర్తి తీసేసిందని, ఎలాంటి కారణం లేకుండా సిబ్బందిని తొలగించినప్పుడే అనేక అనుమానాలు కలిగినట్లు తెలిపారు.