ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయపెడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో తలపెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల ఆదేశాల మేరకు విద్యా సంస్థలు, సినిమా హాళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరగొద్దని సూచనలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో స్థానిక ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వాయిదా వేశారు. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఊహించని మార్పులు వచ్చాయని, బ్యాలెట్ పేపర్ ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అందుకే విధిలేని పరిస్థితుల్లో వాయిదా వేయాల్సి వచ్చిందని ప్రకటించారు.