HomeTelugu Big Storiesరివ్యూ: అంధగాడు

రివ్యూ: అంధగాడు

నటీనటులు: రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్రప్రసాద్, షాయాజీ షిండే, ఆశీష్ విద్యార్హి, సత్య తదితరులు.
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్
నిర్మాత: అనిల్ సుంకర
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్
ఇప్పటికే హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ లు నటిస్తోన్న మరో చిత్రం ‘అంధగాడు’. రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకక్కించిన ఈ చిత్రాన్ని ఏ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
గౌతమ్ (రాజ్ తరుణ్) వైజాగ్ లో రేడియో జాకీగా పనిచేసే అంధుడు. ఎప్పటికైనా తనకు కళ్ళు వస్తాయనే నమ్మకంతో.. తనకు కళ్లను దానం చేసే డోనర్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఆ సమయంలో నేత్ర (హెబ్బా పటేల్) పరిచయమవుతుంది. తను గుడ్డివాడినని ఆమెకు తెలిస్తే తనతో ఎక్కడ మాట్లాడదో.. అని భావించి కళ్ళున్న వ్యక్తిలా మేనేజ్ చేస్తుంటాడు. నేత్రకు గౌతమ్ అంధుడు అనే విషయం తెలిసిపోతుంది. అదే సమయంలో కులకర్ణి(రాజేంద్రప్రసాద్) అనే వ్యక్తి హఠాత్తుగా మరణించడంతో అతడి కళ్ళను గౌతమ్ కు పెడతారు. గౌతమ్ కు కళ్ళు వచ్చిన తరువాత నుండి కొన్ని సమస్యలు మొదలవుతాయి. తనకు ఒక కారు, ఎవరెవరో వ్యక్తులు కనిపిస్తుంటారు. వారి వల్ల గౌతమ్ కు ప్రాణహాని కలుగుతుంటుంది. ఇంతకీ ఆ కారు స్టోరీ ఏంటి..? వాళ్ళు గౌతమ్ ను ఎందుకు చంపాలనుకుంటున్నారు..? గౌతమ్ ను నేత్ర ప్రేమిస్తుందా..? అనే విషయాలు తెలియాలంటే సినిమాచూడాల్సిందే!

విశ్లేషణ:
లవ్, కామెడీతో కూడిన ఓ రివెంజ్ డ్రామాను లైన్ గా రాసుకున్నాడు రచయిత వెలిగొండ శ్రీనివాస్. ఈ సినిమాతో మొదటిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అనాధ అంధులు అనే ఉద్వేగపూరితమైన పాయింట్‌కు కమర్షియల్ హంగులు జోడించడం అభినందనీయం. కానీ కథలో ఇంటెన్సిటీకి తగినట్టు కథనం లేకపోవడం, నిర్మాణ విలువలు నాసిరకంగా ఉండటం ఈ సినిమా వేగానికి ప్రధాన అడ్డంకులుగా మారాయి. ఫస్టాఫ్‌లో చాలా రొటీన్‌గా సాగిపోతున్న సమయంలో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో మంచి ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో కథ రచయితగా, దర్శకుడిగా సఫలమయ్యాడు. కానీ రెండో భాగాన్ని ఆశించినంత ఆసక్తికరంగా తెరకెక్కించలేకపోయారు. ప్రీ క్లైమాక్స్ లో ఎమోషనల్ పాయింట్ ను టచ్ చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే ప్రయత్నం చేశారు.
అంధుడిగా రాజ్ తరుణ్ నటన ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం తన భుజాలపై వేసుకొని నడిపించాడు. తన నటనలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. తన గెటప్ తో స్టైలిష్ గా కనిపించే ప్రయత్నం చేశాడు. నేత్ర పాత్రలో హెబ్బా పటేల్ నటించడానికి చాలా కష్టపడినట్లు అనిపిస్తుంది. తను తెరపై కనిపించే కాసేపు కూడా అలరించడానికి బాగా తిప్పలు పడింది. అమ్మడి మేకప్, డ్రెస్సింగ్ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో సినిమాలో హెబ్బా ఏవరేజ్ లుక్స్ తో కనిపించింది. రాజేంద్రప్రసాద్ పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది కానీ.. ఆ పాత్రకు ట్విస్టులు ఎక్కువ ఉండడంతో క్యారెక్టర్ ఇంపాక్ట్ కథతో పెద్దగా సింక్ కాలేదు. అయితే రాజేంద్రప్రసాద్ మాత్రం తన అనుభవంతో పాత్రకు ప్రాణం పోసాడు. హీరో స్నేహితుడిగా సత్య తన కామెడీ
టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. రాజారవీంద్ర విలనిజాన్ని సరిగ్గా ఎలివేట్ చేయలేదు.
అంధగాడు చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. మిగితా చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో సంగీతం అంతంత మాత్రమే. సన్నివేశాలను ఎలివేట్ చేసే విధంగా రీరికార్డింగ్ అందించడంలో కొన్ని లోపాలు కనిపించాయి. కెమెరా, ఎడిటింగ్, ఇతర విభాగాలు తమ బాధ్యతను ఓకే అనిపించే విధంగా పనిచేశాయి. నిర్మాణ విలువలు పేలవంగా ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu