కరోనాపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురికాకుండా ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేస్తోంది. దీనికి తోడుగా టాలీవుడ్, బాలీవుడ్ నటులు కూడా తమవంతు బాధ్యతగా ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇప్పుడు భారత్‌కూ పాకింది. ఇప్పటికే భారత్‌లో 116 మందికి పైగా కరోనా బాధితులు ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, బార్లు, పబ్‌లు సహా జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మూసివేశారు.
ప్రజలు గుంపులు గుంపులుగా ఉండొద్దని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాయి. ఎక్కడికక్కడే శానిటేషన్ చర్యలు చేపట్టారు. దీనిపై అన్ని రాష్ట్రాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ ప్రభావం తక్కువనే చెప్పాలి. ఏపీ, తెలంగాణలోని వ్యక్తులకు ఎవరికీ కరోనా వైరస్ సోకలేదు కానీ విదేశాల నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులకు కరోనా లక్షణాలు ఉండటంతో వెంటనే ఐసొలేషన్ వార్డుకు తరలిస్తున్నారు. దీంతో కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్ట గలుగుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఎయిర్‌పోర్టుల్లో క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే అనుమతిస్తున్నారు.
ప్రజలకు అవగాహనా కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ప్రముఖ యాంకర్ సుమ కూడా కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే పలు సూచనలు చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్‌లో మరో పోస్ట్ చేసింది. కరోనా పై భయపడాల్సిన పనిలేదు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించింది. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని.. చేతులతో ముఖం, కళ్లను టచ్ చేయకుండా చూసుకోవాలని సూచనలు చేసింది. వీలైనంతవరకు మాస్కులు వాడాలని తెలిపింది. నేనైతే ప్రతి రోజూ శానిటైజర్ వాడుతున్నా.. చేతులను శుభ్రంగా కడుక్కుంటున్నా.. అని తెలిపింది. ఒకవేళ ఎవరికైనా దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని.. మన పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే వారికి దూరంగా ఉండాలని.. అలాగే వారికి వైద్య పరీక్షలు చేయించుకోమని సలహా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఎవరైనా కలిసినప్పుడు నమస్కారం చేయాలని.. హగ్‌లు, షేక్ హ్యాండ్‌లకు దూరంగా ఉండాలని సూచించింది.
Hi guys, in alert of the recent pandemic #COVID19, I request you all to be precautious and responsible in being safe. Just a few cautionary steps can stand a long way in our safety and help breaking the chain.#StaySafe #BreakTheChain #coronavirus #CoronavirusOutbreak pic.twitter.com/6J7LCnRNXq
— Suma Kanakala (@ItsSumaKanakala) March 16, 2020