తెలుగు యాంకర్ ప్రదీప్ గురించి అందరికి తెలిసిందే. పలు కార్యక్రమాలకు హోస్ట్ చేస్తూ.. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ఈ యాంకర్. తాజాగా ఆయన సుమ నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్‌షోలో సందడి చేశారు. తన పర్సనల్ లైఫ్ గురించి బయటవారికి తెలియని ఎన్నో సరదా సంగతులను పంచుకున్నారు.
”మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి వెళ్లినప్పుడు దూరం నుంచే ఆయన నన్ను చూసి.. దగ్గరకు రమ్మని పేరు పెట్టి పిలిచారు. ‘మీ వాయిస్ నాకు బాగా ఇష్టం. మీరు పలికే తెలుగు పదాల ఉచ్చారణ నాకెంతో నచ్చుతుంది’ అని ఆయన ప్రశంసించారు. ఆయన మాటలతో అలాగే నిల్చుండిపోయాను. వెంటనే ఆయన కూర్చొండి అని చెప్పారు. ఆ క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి” అని ప్రదీప్ వివరించారు. అంతేకాకుండా తాను హీరోగాను టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాటకు మంచి స్పందన అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు ప్రదీప్.