బాలీవుడ్లో మొదలైన డ్రగ్స్ వివాదం శాండల్ వుడ్ను సైతం కుదిపేస్తోంది. డ్రగ్స్ మాఫియాతో కన్నడ చిత్ర సీమలో పలువురు నటీనటులకు సంబంధాలు ఉన్నాయని గుర్తించిన సీసీబీ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో హీరోయిన్లు రాగిణి ద్వివేది – సంజన గల్రానిలతో పాటు పలువురు డ్రగ్ డీలర్లను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే విచారణకు సహకరించని నిందితులకు నార్కో అనాలసిస్ టెస్ట్ నిర్వహించడానికి సీసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.
కాగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన నిందితుల రక్త నమూనాలు – వెంట్రుకలు – మొబైల్ ఫోన్లను హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్ కు పంపించామని జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ వెల్లడించారని తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీసీబీ శాండిల్వుడ్ లోని ప్రముఖులను విచారిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల యాంకర్ అనుశ్రీ ని కూడా విచారించారు. దీంతో ఆమెపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన అనుశ్రీ ఏడుస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని సీసీబీ విచారణ చేసినంత మాత్రాన తాను నేరస్తురాలిని కాదని. సీసీబీకి తెలిసిన మేర వివరాలు అందించానని.. తాను ఎలాంటి తప్పు చేయలేదని యాంకర్ ఆవేదన వ్యక్తం చేసింది.