స్టార్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కథనం’. ఎన్. రాజేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, ధనరాజ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్‌ను హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన విడుదల చేశారు. ‘ప్రియమైన అనసూయకు ఆల్ ది బెస్ట్. టీజర్ చాలా గొప్పగా ఉంది’ అని ఆమె ట్వీట్ చేశారు. దీనికి అనసూయ ప్రతి స్పందిస్తూ.. ‘ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తున్న, నాకు స్ఫూర్తి అయిన ఉపాసనకు ధన్యవాదాలు’ అని పోస్ట్ చేశారు.
‘అను నువ్వు మొట్టమొదట ఏ సినిమా తీసినా.. బ్యానర్ బాబాయ్‌దే పడాలి. నేను కమిట్ అయిపోయాను’ అనే డైలాగ్‌తో టీజర్ ఆరంభమైంది. ఇందులో అనసూయ దర్శకురాలిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె సినిమా తీయడానికి రాసుకున్న స్క్రిప్టు నిజ జీవితంలో జరుగుతుంటుంది. దీంతో ఆమె చిక్కుల్లో పడ్డట్లు టీజర్‌లో చూపించారు. ‘మీరు నమ్మినా, నమ్మకపోయినా.. నేను రాశాను, రాసిందే జరిగింది’ అని అనసూయ గట్టిగా అధికారితో చెప్పారు. ‘నిర్ణయాలు తీసుకునేవారు నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒకరు మేలుకుంటారు సర్’ అంటూ పవర్‌ఫుల్‌గా ఈ ప్రచార చిత్రాన్ని చూపించారు.