యాంకర్ అనసూయ బుల్లితెర, వెండితెర కూడా రాణిస్తున్నారు. ‘క్షణం’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ‘రంగస్థలం’ సినిమాతో రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు పెరుగుతున్నాయి. ఇటీవల ‘F2’లో ఓ పాటలో నర్తించారు. ఆమె ఓ ముఖ్య పాత్ర పోషించిన ‘యాత్ర’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే, అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కథనం’. ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్, గాయత్రి ఫిల్మ్స్ బ్యానర్లపై బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేసుకుని ఈ ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అనసూయ పాల్గొన్నారు.
అనసూయ మాట్లాడుతూ ‘కథనం’ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. అయితే ఫస్ట్‌లుక్ చూసిన తరవాత ఈ చిత్రంలో తన పాత్ర ‘క్షణం’లో మాదిరిగానే కనిపిస్తోందని అందరూ అన్నారన్నారు. అయితే ఈ చిత్రంలో తాను పోలీస్ ఆఫీసర్‌గా నటించడంలేదని స్పష్టతనిచ్చారు. తనది ఏడీ (అసోసియేట్ డైరెక్టర్) క్యారెక్టర్ అని చెప్పారు. బుధవారంతో టాకీ పార్ట్ షూటింగ్ పూర్తవుతుందని, ఇంకా రెండు పాటలు షూట్ చేయాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు తనను అందలం ఎక్కించారని, ఈ సినిమాతో తనను ఇంకో మెట్టు ఎక్కిస్తారని కోరుకుంటున్నాని అన్నారు. కాగా, ఈ చిత్రంలో అనసూయతో పాటు అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెన్నెలకిషోర్, పెళ్లి పృధ్వీ, సమీర్, ముఖ్తార్‌ఖాన్, రామరాజు, జ్యోతి తదితరులు నటించారు. సతీష్ ముత్యాల డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించారు.సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.