టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ముంబయిలో ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కరణ్ జోహార్, ఛార్మి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జంటగా ఎవరు నటిస్తారనే విషయంలో అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో విజయ్ సరసన అనన్యపాండే నటించనున్నారంటూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా పూరీ జగన్నాథ్ అనన్య పాండేతో దిగిన పలు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘ఛార్మి, కరణ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ‘మా పాన్ ఇండియన్’ సినిమాలో నా హీరో విజయ్ దేవరకొండ సరసన నటించనున్న ముద్దుగుమ్మ అనన్యపాండేకు స్వాగతం’ అని పూరీ పేర్కొన్నారు.
యాక్షన్ ప్రధానంగా సాగే ఓ ప్రేమ కథతో తెరకెక్కతున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ థాయ్‌లాండ్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ సరసన మొదట జాన్వీ కపూర్ నటించనున్నారంటూ ప్రచారం జరిగింది.