నటీనటులు: తాప్సీ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్, రాజీవ్ కనకాల
తదితరులు
సినిమాటోగ్రఫీ: అనీష్ తరుణ్ కుమార్
సంగీతం: కె
ఎడిటింగ్: శ్రవణ్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
దర్శకత్వం: మహి వి రాఘవ్
తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘ఆనందో బ్రహ్మ’. భయానికి నవ్వంటే భయం అనే క్యాప్షన్ తో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
రాము(రాజీవ్ కనకాల) పది కోట్లు విలువ చేసే తన ఇంటిని అమ్మకానికి పెడతాడు. అయితే ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని ఎవరు ఆ ప్రాపర్టీను కొనడానికి సాహసం చేయరు. ఈ క్రమంలో ఆ ఇంట్లో నాలుగు రోజుల పాటు ఉండడానికి సిద్ధూ(శ్రీనివాసరెడ్డి) అంగీకరిస్తాడు. తనతో పాటు బాబు(షకలక శంకర్), రాజు(వెన్నెల కిషోర్), తులసి(తాగుబోతు రమేష్) అనే ముగ్గురు వ్యక్తులను ఆ ఇంటికి తీసుకువెళ్తాడు. డబ్బు అవసరంతో ఈ నలుగురు కూడా ఆ ఇంట్లో ఉండడానికి సిద్ధపడతారు. మరి తరువాత ఏం జరిగింది..? ఆ నలుగురికి ఇంట్లో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి..? చివరకు ఆ ఇల్లు ఎవరి సొంతం అయింది..? అనే విషయాలు తెరపై చూడాల్సిందే!
విశ్లేషణ:
హారర్ కామెడీ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. హారర్ తో కూడిన కామెడీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు దెయ్యం, మనుషులను భయపెట్టం చూశాం.. కానీ మొదటిసారి మనుషులే దెయ్యాలను భయపెడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ‘ఆనందోబ్రహ్మ’ చిత్రాన్ని రూపొందించారు. సినిమా మొదటి భాగం కాస్త స్లోగా నడుస్తుంది. సెకండ్ హాఫ్ నుండి మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవుతాడు. దెయ్యాలు, ఆ నలుగురు వ్యక్తుల మధ్య నడిచే సన్నివేశాలు, సంభాషణలు చాలా ఆసక్తికరంగా సాగుతాయి. ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. షకలక శంకర్ కామెడీ సినిమాకు హైలైట్ గా
నిలిచింది.
వెన్నెల కిషోర్ పాత్ర కొత్తగా అనిపిస్తుంది. ఆడియన్స్ ను తన నటనతో బాగా నవ్వించాడు. తాగుబోతు రమేష్, శ్రీనివాస్ రెడ్డి ఇలా ప్రతి ఒక్కరి పాత్రకు ప్రాముఖ్యత ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా కథను తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. తాప్సీ తన పాత్రలో ఒదిగిపోయింది. రాజీవ్ కనకాల నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగా నటించాడు. అతి తక్కువ బడ్జెట్ లో క్వాలిటీతో సినిమాను రూపొందించారు. సినిమాటోగ్రఫీ వర్క్ కథకు తగ్గట్లుగా ఉంది. నేపధ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమా మొదటి భాగంలో కథనం స్లోగా ఉన్నప్పటికీ కామెడీతో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.
మొత్తానికి హారర్ కామెడీ జోనర్ లో కొత్త పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని మెప్పించడంలో సక్సెస్ అయ్యారు.
రేటింగ్: 3/5