ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ సినిమాకి డ్యూయెట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దగ్గర పనిచేసిన మిథున్ వరదరాజ కృష్ణన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండతో పాటు దర్శకులు హరీశ్ శంకర్, చందూ మొండేటి, సాయి రాజేశ్, హీరో సత్య దేవ్ ఆనంద్ పేరెంట్స్ గోవర్థన్ దేవరకొండ, మాధవి చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. మూహూర్తపు సన్నివేశానికి హీరో హీరోయిన్లపై దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ కొట్టారు. దర్శకుడు సాయిరాజేశ్, జ్ఞానవెల్ రాజా , సహ నిర్మాత మధుర శ్రీధర్.. స్క్రిప్ట్‌ను దర్శకుడు మిథున్‌కు అందజేశారు.
తొలి షాట్‌ను చందూ మొండేటి డైరెక్ట్ చేశారు. ఆనంద్ తల్లిదండ్రులు గోవర్ధన్ దేవరకొండ మాధవి దేవరకొండ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. ఆనంద్‌కు తానే తొలి బ్లాక్‌బస్టర్ అందించాలనుకున్నానని, అయితే ఆ అవకాశం అతడు ఇవ్వలేదని అన్నారు. ఆనంద్‌తో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని, బేబీ లాంటి చిత్రంలో ఆనంద్ నటిస్తాడని, అది పెద్ద హిట్ అవుతుందని తాను అనుకోలేదన్నారు.
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. నా కెరీర్‌లో ఈ సినిమా ఎంతో స్పెషల్ మూవీ. ఈ సినిమా టైటిల్‌ను కొంతమంది స్నేహితులతో షేర్ చేసుకున్నప్పుడు టైటిల్ బాగుంది మేము రిజిస్టర్ చేసుకుంటే బాగుండేది అన్నారు. అక్కడి నుంచి డ్యూయెట్పై పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. జ్ఞానవేల్ సర్ కోలీవుడ్‌లో సూర్య, కార్తిలతో సినిమాలు చేశారు. ఇక్కడ మాతో( ఆనంద్, విజయ్ దేవరకొండ) కూడా చేయాలని ఆశిస్తున్నాను. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయన మా సినిమాకి సంగీతం అందిస్తారని దర్శకుడు చెప్పగానే హ్యాపీగా ఫీల్ అయ్యాను. రావు రమేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.