టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ టాలీవుడ్‌లో ‘దొరసాని’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హోమ్ బ్యానర్ లో నటించిన ‘పుష్పక విమానం’ అనే కామెడీ ఎంటర్టైనర్ ని విడుదలకు రెడీ చేస్తున్నారు. ఆనంద్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా మూడు ప్రాజెక్ట్స్ ని ప్రకటించాడు. ఈ క్రమంలో యువ హీరో తాజాగా మరో కొత్త సినిమాని ప్రారంభించాడు.
తెలుగులో ‘118’ ‘www’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో ‘హైవే’ అనే చిత్రంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈరోజు గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే గడారి కిషోర్ కుమార్ క్లాప్ కొట్టగా.. డైరెక్టర్ వీరభద్రం చౌదరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఇదొక ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. దీనికి సైమన్ కె.కింగ్ సంగీతం సమకూర్చనున్నారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘హైవే’ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.