భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో వేడుకగా జరగనుంది. చలనచిత్ర రంగంలో ప్రతిభను కనబరిచి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న చిత్రాలతోపాటు, నటీనటులకు జాతీయస్థాయిలో అవార్డులను అందజేయనున్నారు. ఈ వేడుకలోనే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా బిగ్‌బి అందుకోనున్నారు. అయితే ఈ అవార్డుల ప్రదానోత్సవానికి తాను హాజరుకాలేకపోతున్నానని బిగ్‌బి ఆదివారం రాత్రి ఓ ట్వీట్ పెట్టారు. ‘జ్వరంతో బాధపడుతున్నాను. ప్రయాణాలు చేయొద్దని చెప్పారు. ఢిల్లీలో జరగబోయే జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నాను. ఇది దురదృష్టకరం. విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.
బిగ్‌బి కొన్నిరోజుల క్రితం ముంబయిలోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లి వచ్చారు. ఆసమయంలో బిగ్‌బి తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని వార్తలు వచ్చాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక.. తాను సాధారణ చికిత్స కోసమే ఆస్పత్రికి వెళ్లాలని బిగ్‌బి తెలిపారు. ఇదిలా ఉండగా నవంబర్‌లో జరిగిన 25వ కోల్‌కతా ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆయన హాజరు కాలేకపోయారు. అనారోగ్యంగా ఉండడం వల్లే రాలేకపోతున్నానని ఆ సమయంలో ఆయన ట్వీట్ చేశారు.
66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించారు. ఇందులో ఉత్తమ చిత్రంగా గుజరాత్ ఫిల్మ్ ‘హెల్లరో’ నిలవగా, ‘ఉరి’ చిత్రంలో నటించిన విక్కీ కౌశల్, ‘అంధాధున్’లో నటించిన ఆయుష్మాన్‌ఖురానా సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డు అందుకోనున్నారు. ‘మహానటి’ చిత్రంలో నటించిన కీర్తి సురేశ్‌కు ఉత్తమ నటి అవార్డు వరించింది.