బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ప్రఖ్యాత దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ సతీమణి జయాబచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితమే ఈ పురస్కారాన్ని అమితాబ్ స్వీకరించాల్సినప్పటికీ అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోయారు. అప్పుడు ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ‘జ్వరంతో బాధపడుతున్నాను. ప్రయాణాలు చేయొద్దని వైద్యులు చెప్పారు. ఢిల్లీలో జరగబోయే జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నాను. ఇది దురదృష్టకరం. విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో అమితాబ్‌కు పురస్కారాన్ని అందజేశారు.
భారతీయ సినిమా రంగానికి విశిష్టసేవలు అందించినందుకు గానూ.. బిగ్‌బీకి ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా అమితాబ్‌ను కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ అభినందిస్తూ ట్వీట్ చేశారు. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి (2019) గాను అవార్డు అమితాబ్ బచ్చన్‌ను వరించింది.