కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన ట్విటర్ ద్వారా స్పందించారు.
సామాజిక మాధ్యమాల్లో కొందరు తాను అనారోగ్యంతో బాధపడుతున్నానంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అమిత్‌షా ట్వీట్ చేశారు. ”నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. నాకు ఎలాంటి జబ్బూ లేదు. గత కొన్ని రోజలుగా నా ఆరోగ్యం గురించి వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకెళ్లి నేను మరణించినట్లు కూడా ట్వీట్లు చేశారు.
దేశం ప్రస్తుతం కొవిడ్-19 మహమ్మారిపై పోరాటం చేస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేను రాత్రి వరకు పనిలో నిమగ్నం అవ్వడం వల్ల ఈ వార్తలను గుర్తించలేకపోయాను. ఆలస్యంగానైనా గుర్తించా. అయితే, వాళ్ల వదంతులను ఖండించడానికి ఈ పోస్టు పెట్టడం లేదు. అయినప్పటికీ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు, నా ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్న వారికి విషయం చేర్చాలన్న ఉద్దేశంతో చెబుతున్నా. నేను ఆరోగ్యంగానే ఉన్నా. ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయొద్దు. నా పనిని నన్ను చేసుకోనివ్వండి. మీరూ మీ పని చూసుకోండి” అంటూ అమిత్‌షా హిందీలో ట్వీట్ చేశారు.