చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. కోర్టుల వద్ద న్యాయవాదులకు సరైన మౌలిక సదుపాయాలు లేవన్నారు. త్రికరణశుద్ధి ఉన్న న్యాయవాదులంతా రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలను చూసి వ్యథ పడలేకే పార్టీ పెట్టానన్నారు. రాయలసీమను కొన్ని గ్రూపులు కబ్జా చేశాయని.. కానీ వారంతా సామాన్య మనుషులే అని మరిచిపోతున్నారని అన్నారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షాలాంటి వారే ఇప్పటి రాజకీయాలకు సరిపోతారని.. ఆయనలా ఉక్కుపాదంతో అణిచివేసే వారికే వీళ్లు భయపడుతున్నారంటూ పరోక్షంగా వైసీపీ నేతలను ఉద్దేశించిన పవన్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తరాలకోసమే తాను కష్టపడుతున్నానని చెప్పారు. ఎంతో కష్టసమయంలో పార్టీ పెట్టానని పవన్‌కల్యాణ్ అన్నారు. మార్పు తెచ్చేందుకు తమ పార్టీ కంకణం కట్టుకుందని.. ఎన్నో ఎదురుదెబ్బలు ఉంటాయని ముందే తెలుసని అన్నారు.