నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవలే నటించిన ‘బింబిసార’ సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన చేసని విభిన్న చిత్రం ‘అమిగోస్’. ఈ సినిమాలో తొలిసారి కళ్యాణ్ రాజ్ ట్రిబుల్ రోల్ చేశాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. మరి ఈ చిత్రం.. ఎంతమేర ఆకట్టుకుందో చూద్దాం.
కథ: సిద్దార్థ్, మంజునాథ్, మైకేల్, ముగ్గురు చూడ్డానికి అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటారు. ఈముగ్గురు ఒక వెబ్ సైట్ ద్వారా కలుస్తారు. వీరిలో సిద్దార్థ్ రేడియో జాకీ అయిన ఇషికా (ఆషికా రంగనాథ్)ను ప్రేమిస్తాడు. మంజునాథ్ మరియు మైకేల్ సాయంతో సిద్ధార్థ్.. ఇషికాను మెప్పించి ఆమె తన ప్రేమలో పడేలా చేస్తాడు. ఆమెతో అతడికి నిశ్చితార్థం కూడా కుదురుతుంది. కానీ ఇంతలో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారులు మంజునాథ్ ను వెంటాడి కాలుస్తారు. తర్వాత అతణ్ని తమ కస్టడీలోకి తీసుకుంటారు. అప్పుడే సిద్ధార్థ్‌కి మైకేల్ గురించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తుంది. మైకేల్ నరరూప రాక్షసుడు అని అతని అసలు పేరు బిపిన్ అని తెలుస్తుంది. అతని కోసమే ఎన్‌ఐఏ వాళ్లు హైదరాబాద్ వచ్చారు అని తెలుస్తుంది. అయితే ఈ బిపిన్ ఎవరు? అతను వీళ్ల జీవితంలోకి ఎందుకు వచ్చాడు? అతని ఎన్‌ఐఏ వాళ్ళకి పట్టించారా? అనేది కథ.
విశ్లేషణ: ఒకే పోలికతో ఉన్న ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగే కథ ఇది. ఈ పాయింట్ వినడానికి చాలా ఆసక్తికరం గా అనిపిస్తుంది. కానీ ఇలాంటి పాయింట్లను తెర మీద ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడం.. రెండు గంటలకు పైగా ప్రేక్షకులను కట్టిపడేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. కానీ ఈ విషయంలో ‘అమిగోస్’ నిరాశపరుస్తుంది. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఒక పాత్ర మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ పెట్టడం. కథనంలో కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకి మైనస్ అనే చెప్పాలి.
స్టార్టింగ్‌లో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. కానీ ఒకే పోలికలున్న ముగ్గురు ఒక చోటికి చేరాక మాత్రం సినిమా రొటీన్‌గా మారిపోతుంది. హీరోయిన్‌తో హీరో ప్రేమలో పడడం.. అతడికి మిగతా ఇద్దరు సాయం చేయడం.. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు రొటిన్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ దగ్గర మళ్లీ ట్రాక్ ఎక్కుతుంది. అక్కడ వచ్చే మలుపుతో మళ్లీ సినిమాపై ఆసక్తి కలుగుతుంది.
ఇక ద్వితీయార్ధంలో మైకేల్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ లో కళ్యాణ్ రామ్ లుక్ ఆకట్టుకుంటుంది. అయితే అతనికి లుక్‌కి తగ్గట్టుగా పాత్రలను డిజైన్ చేయలేదు అని పిస్తుంది. ఇలాంటి పాత్రల్ని తెరపై చూస్తున్నపుడు కలగాల్సిన భయం.. ఉత్కంఠ మాత్రం కలగవు. విలన్-హీరో మధ్య ఎత్తులు పై ఎత్తులతో కథనం ఓ మోస్తరుగా సాగిపోతుంది. యాక్షన్ సీన్‌స్ అక్కడక్కడ ప్రేక్షకులకు ఆకట్టుకుంటాయి.
నటీనటులు: కళ్యాణ్ రామ్ తన నటన, హవ భావాలు, మూడు పాత్రల్లో వేరియేషన్‌ని బాగానే చూపించాడు. అయితే ఈసినిమాలో అందరి దృష్టీ నెగెటెవ్ పాత్ర అయిన మైకేల్ మీదే ఉంటుంది. ఈ సినిమాకి ఈ పాత్రే హైలైట్ అని చెప్పాలి. హీరోయిన్ ఆషికా రంగనాథ్ పర్వాలేదు. ఆమె బబ్లీగా కనిపించింది. నటుడు బ్రహ్మాజీ బాగానే చేశాడు. సప్తగిరి కాసేపు మెరిసి మాయమయ్యాడు. హీరో తల్లిదండ్రుల పాత్రల్లో తమిళ ఆర్టిస్టులు జయప్రకాష్-కళ్యాణ్ నటరాజన్ తమ పరిది మేరకు నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు సినిమాకి తగినట్లుగా ఉన్నాయి. కొత్త దర్శకుడు రాజేందర్ రెడ్డి ఎంచుకున్న కథలో కొత్తదనం ఉంది కానీ దానీ తెరపై చూపించలేకపోయాడు అనిపిస్తుంది.
టైటిల్ :’అమిగోస్’
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, జయప్రకాష్, సప్తగిరి తదితరులు
నిర్మాతలు:వై.రవిశంకర్-నవీన్ ఎర్నేని
దర్శకత్వం: రాజేందర్ రెడ్డి
సంగీతం: జిబ్రాన్
హైలైట్స్: ‘మైకేల్’ పాత్ర
డ్రాబ్యాక్స్: కొత్తదనం లేకపోవడం
చివరిగా:అక్కడక్కడ తప్ప పెద్దగా ఆకట్టుకోని ‘అమిగోస్’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)