Ambajipeta marriage band Review: టాలీవుడ్ నటుడు సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓటీటీలో ఈ సినిమా సెన్సేషన్‌గా నిలిచింది. ఆ తరువాత రైటర్ పద్మభూషణ్ లో నటించాడు. తాజాగా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ వచ్చాడు. మంచి అంచనాల మధ్య ఈ రోజు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అంబాజిపేటలో 2007 ప్రాంతంలో ఈ కథ జరుగుతుంది. వెంకట్ (నితిన్ ప్రసన్న) ఊర్లో పెద్ద మనిషిగా చెలామణి అవుతూ.. అందరికీ వడ్డీకి అప్పులు ఇస్తూ ఉంటాడు. ఆ గ్రామంలో మల్లి (సుహాస్) తన కులవృత్తిని చేసుకుంటూనే మ్యారేజి బ్యాండులో పని చేస్తుంటాడు. మల్లి అక్క పద్మ (శరణ్య) అదే ఊర్లో స్కూల్ టీచర్‌గా పని చేస్తుంటుంది. పద్మకు వెంకట్‌కు ఏదో ఉందని ఊరంతా పుకార్లు నడుస్తుంటాయి. వెంకట్ చెల్లి లక్ష్మీ (శివానీ), మల్లి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులం, డబ్బుని చూసుకుని అహంకారంతో రెచ్చిపోయే వెంకట్.. ఆత్మాభిమానంతో ఉండే మల్లి, పద్మలకు వైరం ఎలా మొదలవుతుంది? ఈ గొడవల్లో మల్లి, లక్ష్మీల ప్రేమ ఏం అవుతుంది? చివరకు వెంకట్ పరిస్థితి ఎంతలా మారిపోతుంది? అనేది కథ.
ఈ సినిమా కథ కొత్తదేమీ కాదు. ఒకప్పుడు గ్రామాల్లో కుల, వివక్ష గురించి అందరికీ తెలిసిందే. కులాలు, పేదోళ్లు, ధనికులు, ప్రేమ అనే పాయింట్‌ల చుట్టూ ఎన్నో కథలు వచ్చాయి. ప్రొమోషన్స్‌లో ఈ సినిమా లవ్ స్టోరీ అనుకుంటాం. అసలు ఇది ప్రేమ కథా చిత్రమే కాదు. ఆత్మాభిమానం కోసం పోరాడే ఓ మహిళ కథ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి శరణ్య పోషించిన పద్మ పాత్రే హీరోలా అనిపిస్తుంది. అసలు పద్మ పాత్రకు రాసుకున్న సీన్లు, డైలాగ్స్‌కు దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే.
ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆత్మాభిమానాన్ని వదలుకోలేమని పద్మ పాత్ర చెప్పే డైలాగ్స్ అద్భుతం. పోలీస్ స్టేషన్‌లో పద్మ యాక్టింగ్, యాక్షన్‌కు విజిల్స్ పడతాయి. ఓ లేడీ కారెక్టర్‌ను ఇంత పవర్ ఫుల్‌గా చూపించడం నిజంగా చాలా గ్రేట్. ఫస్ట్ హాఫ్ ప్రారంభం కాస్త స్లోగా అనిపిస్తుంది. ప్రేమ కథ ప్రారంభం అయినప్పటి నుంచి యూత్ బాగానే కనెక్ట్ అవుతారు.
కథ ముందుకు వెళ్తున్న కొద్ది కాస్త సీరియస్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌కు పీక్స్‌కు చేరుతుంది. ద్వితీయార్దం కూడా అంతే ఎమోషనల్‌గా సాగుతుంది. అలా ఏదో చప్పగా సాగుతున్న టైంలోనే హైకి చేరుతుంది. క్లైమాక్స్ కూడా రొటీన్‌కు భిన్నంగా ఉంది. చంపడం పరిష్కరం కాదని, మనలాంటి వాళ్లు చంపితే హంతుకుడే అంటారు అంటూ హీరో చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి.
సాంకేతికంగా ఈ సినిమా ఎంతో ఉన్నతంగా కనిపిస్తుంది. పాటలు థియేటర్లో వింటుంటే డ్యాన్సులు వేయాల్సిందే. ఆర్ఆర్ స్క్రీన్ మీదున్న ఎమోషన్‌ను వందరెట్లు పెంచినట్టుగా అనిపిస్తుంది. విజువల్స్ నేచ్యురల్‌గా ఉన్నాయి. సినిమాను చూస్తుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది. కంటెంట్ ఉంటే.. కటౌట్ అవసరం లేదు అని మరోసారి నిరూపించారు. సుహాస్ ఈ సినిమాలో అద్భుతం నటించాడు. తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. శరణ్య పాత్ర ఈ సినిమాకి హైలైట్. శివాని పోషించిన పాత్ర కూడా బాగానే ఉంది. విలన్‌గా నటించిన నితిన్ ప్రసన్న తన పాత్రకు న్యాయం చేశాడు. మిగతా నటీనటులు అందరూ తమ పాత్ర మేరకు మెప్పించారు.