స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తనలోని కళను మరోసారి అందరికీ పరిచయం చేశారు. నటుడిగానే మనందరికీ పరిచయం ఉన్న బ్రహ్మానందంలో ఓ మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. షూటింగ్స్ నుంచి కొంత ఖాళీ దొరికితే ఆయన పలు స్కెచ్‌లు వేస్తుంటారు. తాజాగా బ్రహ్మానందం కరోనా నియంత్రణ కోసం భారత్ చేస్తున్న పోరును ఓ స్కెచ్ రూపంలో చూపించారు. ఈ మేరకు ఆయన భారత్ లాక్‌డౌన్ అనే అస్త్రంతో కరోనా వైరస్‌కే భయం తెప్పిస్తున్నట్లు చూపించారు. ప్రస్తుతం ఆయన వేసిన స్కెచ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొన్ని వందల చిత్రాల్లో హాస్యనటుడిగా మెప్పించిన బ్రహ్మానందం ఇటీవల ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలో అతిథి పాత్రలో సందడి చేశారు. మరోవైపు బ్రహ్మానందం.. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో నటిస్తున్నారు. మరాఠిలో మంచి విజయం సాధించిన ‘నటసామ్రాట్’ చిత్రానికి రీమేక్‌గా ‘రంగమార్తాండ’ తెరకెక్కుతుంది.