ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో 50 రోజులుగా రైతులు, రైతు కూలీలు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నుంచి 3 రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ రైతులు, మహిళలు, పిల్లలు సహా రోడ్డెక్కారు. వీరికి ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు, సమాజంలోని వివిధ వర్గాలు మద్దతు తెలిపాయి. రైతుల ఆందోళనల సమయంలో కొన్నిచొట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ రాజధాని ప్రాంత రైతులు సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని ప్రాంత రైతులు… వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవితో పాటు వెళ్లి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాల రైతులు ఈ సమవేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో రైతులకు సీఎం వైఎస్ జగన్ పలు హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
సీఎంతో జగన్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు, రైతు కూలీలు సీఎం జగన్ ను కలిశారని రాజధాని రైతులకు కౌలు పెంచినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారని వెల్లడించారు. బలవంతపు భూసేకరణ నుంచి తమ గ్రామాలకు మినహాయింపు ఇవ్వాలని రైతులు సీఎంను కోరినట్టు తెలిపారు. వారం, పది రోజుల్లో భూసేకరణ ఆదేశాలను ఉపసంహరించాలని అధికారులకు సీఎం ఆదేశించారని తెలిపారు. మంగళగిరి, తాడికొండలో బలవంతంగా 5వేల ఎకరాల భూ సేకరణ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని సీఎం ఆదేశించారని.. రాజధానిలో రిజర్వు జోన్లు ఎత్తివేసేందుకు సీఎం అంగీకరించారని వెల్లడించారు. అదే విధంగా రైతుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అధికారులను సీఎం సూచించినట్లు తెలిపారు. రాజధానిని తరలించడం లేదని. . పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల్లో అభివృద్ది చేస్తున్నట్లు సీఎం చెప్పారని ఆర్కే అన్నారు. తాడేపల్లి, మంగళగిరి పట్టణాల తరహాలో గ్రామాలను అభివృద్ది చేయాలని రైతులు కోరారని, మంగళగిరి నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ది పనులను 3నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు.