ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారానికి 20వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు నుంచి 10 వేల మంది రైతులు, యువకులు, మహిళలతో మందడం వరకు ఇవాళ ఉదయం మహా పాదయాత్రను ప్రారంభించారు. తమ పాదయాత్రను ఎవ్వరూ అడ్డుకోలేరని రైతులు స్పష్టం చేశారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలు చేతబట్టి.. జై అమరావతి నినాదాలతో రైతులు ముందుకు కదులుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ జిరాక్స్ కాపీలుగా బోస్టన్, జీఎన్ రావు కమిటీలు మారాయని రైతులు ఆరోపించారు. రేపు వెలువడనున్న హై పవర్ కమిటీ నివేదిక కూడా వీటికి కలర్ జిరాక్స్ తప్ప ఇంకొకటి కాదని విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 33 వేల ఏకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల త్యాగాలను అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు నేడు రాజధాని గ్రామాల్లో పాదయాత్రకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందనీ.. కానీ ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకూడదన్నారు.