అమరావతి ప్రాంతంలోని మందడంలో ఇవాళ ధర్నా చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసుల దౌర్జన్యంపై నిరసనలు వెల్లువెత్తాయి. మహిళలను బలవంతంగా ఈడ్చు కెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించడంపై రైతులు మండిపడుతున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలు, రైతులపై పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రేపు రాజధాని అమరావతి బంద్ కు రైతులు పిలుపు నిచ్చారు. నిరసన దీక్ష చేస్తున్న తమపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని మహిళా రైతులు ఆరోపించారు. తమను అక్రమంగా అరెస్టు చేశారంటూ.. తుళ్లూరు పోలీస్ అవుట్ పోస్ట్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే, అవుట్ పోస్టులో ఫిర్యాదు తీసుకోలేమని.. తూళ్లూరుకు వెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. దీంతో మహిళలు తూళ్లూరు పీఎస్‌కు వెళ్లారు. మందడంలో రైతుల నిరసనకు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సంఘీభావం తెలిపారు. పోలీసులు మహిళలపై అమానుషంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసనతెలుపుతున్న వారిని కావాలనే రెచ్చగొట్టారని ఆరోపించారు. పోలీసులపై ప్రైవేటు కేసు పెడతామని హెచ్చరించారు.