టాలీవుడ్‌పై నటి అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన అమలా.. తాను తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉందన్న విషయం తనకు అర్థమైందన్నారు. ఆ కుటుంబాలే చిత్ర పరిశ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్న విషయాన్ని గుర్తించినట్టు చెప్పారు. వారు తీసే సినిమాలు కూడా భిన్నంగా ఉండేవని, వారి ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉండేవారని అన్నారు. వారిని గ్లామరస్ గా చూపిస్తూ లవ్ సీన్స్, పాటలకు మాత్రమే పరిమితం చేసేవారని అమలాపాల్ చెప్పుకొచ్చారు. ఆ సినిమాలు చాలా కమర్షియల్‌గా ఉండేవని, అందుకనే తాను తెలుగు ఇండస్ట్రీకి దగ్గర కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.
కెరియర్ తొలినాళ్లలో ఆడిషన్స్, మీటింగ్స్ వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానన్న అమలాపాల్.. తమిళ సినిమాతో కెరియర్ ప్రారంభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. అయితే, కెరియర్ ప్రారంభంలో చేసిన రెండు సినిమాలు ఇప్పటికీ విడుదల కాలేదని, ఆ తర్వాత చేసిన ‘మైనా’ సంచలనం సృష్టించిందని పేర్కొన్నారు. ఆ చిత్రం తర్వాత ఆఫర్లు క్యూ కట్టాయని గుర్తు చేసుకున్నారు. అమలాపాల్ తెలుగులో ‘నాయక్’, లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు, ఇద్దరమ్మాయిలతో.. వంటి సినిమాల్లో నటించారు. ఆ మధ్య ‘పిట్టకథలు’ వంటి నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో నటించింది.. చివరగా తెలుగులో ఆహా ఓటీటీలో ‘కుడి ఎడమైతే’ అనే సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తో మెప్పించింది. ఇప్పుడు టాలీవుడ్ పై అమలాపాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.