హీరోయిన్ అమలా పాల్.. ‘ఆమె’ సినిమా టీజర్ చూసి తనను విజయ్ సేతుపతి చిత్రం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు . విజయ్, అమల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. చివరి నిమిషంలో అమలను ఈ చిత్రం నుంచి తొలగించారు. ఆమె ముందు ఒప్పుకొన్నప్పుడు అడిగిన రెమ్యూనరేషన్ కన్నా ఇప్పుడు ఎక్కువగా అడగడంతో పాటు పలు షరతులు కూడా పెట్టారని అందుకే నిర్మాత సినిమా నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా అమల స్పందించారు. తనపై వస్తున్న వార్తలన్నీ అబద్ధమంటూ ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.
‘విజయ్ సేతుపతి నటిస్తున్న 33వ చిత్రం నుంచి నన్ను తొలగించినందుకు బాధతో ఈ ప్రెస్ నోట్‌ను విడుదల చేశా. నేను నిర్మాణ సంస్థ పట్ల స్నేహపూర్వకంగా లేనన్న కారణంతో నన్ను తీసేశారని అన్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో నేను నిర్మాణ సంస్థలకు నా మద్దతును తెలపలేదా? అని నన్ను నేను ప్రశ్నించుకునేలా చేసింది ఈ ఘటన. నేను నటించిన ‘భాస్కర్ ఒరు రాస్కల్’ సినిమా కోసం నాకు రావాల్సిన డబ్బును కూడా వదులుకున్నాను. ఎందుకంటే నిర్మాత సినిమా వల్ల కష్టాలు పడ్డారని తెలిసింది. కాబట్టి ఆయనకు నేను ఆర్థికంగా సాయం చేయాలనుకున్నా. నేనెప్పుడూ నాకు రావాల్సిన పారితోషికం ఇంకా రాలేదేంటి? అని ఎవ్వరినీ ప్రశ్నించలేదు, ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదు’
‘త్వరలో విడుదల కాబోతున్న ‘అదో అంద పారవాయ్ పోలే’ సినిమా కోసం నాకు ఓ గ్రామంలోని ఇంట్లో వసతి కల్పించారు. నగరంలోని హోటళ్లలో వసతి కల్పిస్తే ఖర్చు ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో అక్కడ వసతిని ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా నేను ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదు. సినిమా కోసం ఇచ్చిన కాల్‌షీట్ల కంటే ఎక్కువ సమయం కేటాయించాను. క్లిష్టమైన ఫైటింగ్ సన్నివేశాల్లో నటించాను. చిత్రీకరణ చివరి రోజు ఏదో సమస్య ఉంటే సినిమా క్వాలిటీ దెబ్బతినకూడదని నేను డబ్బును వెచ్చించాను’
‘ఇటీవల నేను నటించిన ‘ఆమె’ మూవీ కోసం అడ్వాన్స్ మాత్రమే తీసుకున్నాను. సినిమా మొత్తం పూర్తి చేశాను. చిత్ర నిర్మాత నాకు పారితోషికం ఇవ్వడానికి కాస్త ఇబ్బంది పడుతున్నా నేనేమీ అనుకోలేదు. ‘ఆమె’ టీజర్ విడుదలయ్యాకే నన్ను విజయ్ సేతుపతి సినిమా నుంచి తొలగిస్తున్నామని నిర్మాత రత్న కుమార్ చెప్పారు. నా సొంత ఖర్చులతో సినిమాకు కావాల్సిన దుస్తులు, వసతి కల్పించుకుంటున్న సమయంలో నన్ను తీసేస్తున్నట్లు సందేశం పంపారు. పైగా నేను ఊటీలో వసతి కల్పించాల్సిందిగా డిమాండ్ చేశానన్న నెపంతో తీసేస్తున్నామని అన్నారు’
‘ఆమె’ టీజర్ ద్వారా ఎక్కడ వారి సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వస్తాయోనన్న ఉద్దేశంతో నన్ను తొలగించారనిపిస్తోంది. ఇలాంటి ఆలోచనా విధానాన్ని మార్చుకుంటేనే చిత్ర పరిశ్రమ బాగుపడుతుంది. అయితే నేను విజయ్ సేతుపతికి వ్యతిరేకంగా ఈ ప్రెస్ నోట్ పెట్టలేదు. ఆయనతో కలిసి నటించాలని నేను కూడా ఎప్పటి నుంచో వేచి చూస్తున్నాను. నాపై చంద్ర ప్రొడక్షన్స్ సంస్థ చేస్తున్న తప్పుడు ఆరోపణలకు బదులివ్వాలన్నదే నా ఉద్దేశం’ అని ఆవేదన వ్యక్తం చేశారు అమల.