ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. మహానటి ఘనవిజయం సాధించటంతో సౌత్‌లోనూ ఈ హవా కనిపిస్తోంది. ఇదే బాటలో మరో చారిత్రక వీరుడి కథను వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. మన్యం వీరుడిగా బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు జీవితకథను మరోసారి వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు.
గంగపుత్రులు లాంటి అవార్డ్‌విన్నింగ్ సినిమాతో పాటు రొమాంటిక్ క్రైమ్ కథ లాంటి కమర్షియల్ సక్సెస్‌ను అందించిన పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో అల్లూరి బయోపిక్ తెరకెక్కనుంది. సీతారామరాజు అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రిసాలి ఫిల్మ్ అకాడమీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన నటనతో అల్లూరి పాత్రకు ప్రాణం పోసిన తరువాత ఎవరు ఆ పాత్రలో కనిపించే సాహసం చేయలేదు.
మరి ఇప్పుడు సునీల్ కుమార్ రెడ్డి సీతారామరాజులో గా ఎవరు మన్యం వీరుడిగా కనిపిస్తారో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. సినిమాను మార్చిలో ప్రారంభించి ఆగస్టులో విడుదల చేసేందుకు సనాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.