స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ తన జీవితం కంటే తన స్టాఫ్ సభ్యుల లైఫ్ ఎంతో ప్రశాంతంగా ఉందని అంటున్నారు. ఎందుకంటే.. వారంతా శనివారం రాత్రి తెగ పార్టీలు చేసుకుంటూ ఉంటారట. ఈ విషయాన్ని బన్నీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అసలు విషయం ఏంటంటే.. బన్నీ స్టాఫ్‌లోని ఓ సభ్యుడైన శరత్‌చంద్ర నాయుడు శనివారం ఇతర సభ్యులతో కలిసి పార్టీ చేసుకున్న అనంతరం దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటో చూసిన బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘ఆదివారం ఉదయాన్నే నాకు కనిపించే దృశ్యం ఏంటంటే.. నా స్టాఫ్ సభ్యులు శనివారం రాత్రి పార్టీలు చేసుకుని ఫొటోలు దిగడం. రాత్రి వేళల్లో వారు ఎంజాయ్ చేసే విధానం చూస్తే వారి జీవితం నాకంటే ఎంతో ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. నన్ను కూడా పిలవచ్చు కదయ్యా..’ అని చమత్కరించారు.