‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగానూ ఫాలోయింగ్ ఏర్పడ్డాయి. తాజాగా అల్లు అర్జున్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ నుంచి ‘గోల్డెన్ వీసా’ను ఆయన అందుకున్నారు.
ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు బన్నీ. ‘ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు దుబాయ్‌కి ధన్యవాదాలు. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు థ్యాంక్స్. త్వరలో మళ్లీ కలుద్దాం’ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
కేవలం కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా ఇస్తుంటుంది. బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, సంజయ్‌దత్, సునీల్ షెట్టి, ఊర్వశి రౌతేలా, వరుణ్ ధావన్, మలయాళ నటులు మోహన్‌లాల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ వంటి వారు గోల్డెన్ వీసా అందుకున్నారు. తాజాగా ఈ జాబితాలో అల్లు అర్జున్ కూడా చేరారు. టాలీవుడ్ లో గోల్డెన్ వీసా అందుకున్న తొలి హీరోగా రికార్డు సృష్టించారు.
ఈ గోల్డెన్ వీసాను పొందే వ్యక్తులకు యూఏఈ రాజధాని అబుదాబీ లేదా దుబాయ్ తదితర సిటీల్లో పదేళ్ల వరకు నివసించే వెసులుబాటు ఉంటుంది. విదేశీయులకు లాంగ్‌టర్మ్ రెసిడెన్సీకి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో యూఏఈ ప్రభుత్వం 2019లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే గోల్డెన్ వీసాలను ప్రవేశపెట్టింది.
ఈ వీసాను ఆటోమెటిక్‌గా పునరుద్ధరిస్తారు. గోల్డెన్ వీసా ఉన్నవారు అక్కడ సొంతంగా వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. అయితే సైన్స్, సినిమా, క్రీడలు తదితర రంగాల్లో ప్రతిభావంతులైన, పేరు పొందిన వ్యక్తులకు మాత్రమే ఈ గోల్డెన్ వీసా ఇస్తారు.