బాలీవుడ్ లో సుశాంత్ రాజ్ పుత్, కృతిసనన్ జంటగా ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. అదే ‘రాబ్తా’. ఈ చిత్రానికి దినేష్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. అయితే ఈ సినిమా తెలుగు ‘మగధీర’ చిత్రానికి దగ్గరగా ఉందని తెలుస్తోంది. ట్రైలర్ లో ఆ విషయం చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. కొన్ని సన్నివేశాలు సేమ్ టూ సేమ్ కట్ కాపీ చేసినట్లుగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నారు మగధీర ఫిల్మ్ మేకర్స్. కాపీ రైట్ యాక్ట్ చట్టం కింద ‘రాబ్తా’పై న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.
దీంతో దీనిపై వివరణ ఇవ్వాలని రాబ్తా సినిమా దర్శకనిర్మాతలకు కోర్టు నోటీసులు పంపింది. దీనిపై మగధీర చిత్రనిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. రాబ్తా సినిమా ట్రైలర్, అలాగే కొందరి నుండి వచ్చిన ఖచ్చితమైన సమాచారంతోనే తాము హైదరాబాద్ కోర్టులో కేసు వేశామని ఆయన అన్నారు. దీంతో కోర్టు వారికి నోటీసులు పంపిందని, జూన్ 1వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని తెలిపిందని అన్నారు. ఎలాంటి అడ్డంకులు లేకపోతే రాబ్తా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రావాలనుకొంది. మరి ఈ కేసుపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో.. చూడాలి!