కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్ డౌన్ ప్రభావం సామాన్య, నిరుపేద కుటుంబాలపై ఆర్థికంగా ఎంతో చూపుతోంది. వారికి అండగా ఉండాలి అని ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు తమ వంతుగా ఆర్థిక సాయం ప్రకటించారు. తాజాగా, నటుడు ‘అల్లరి’ నరేశ్ కూడా తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. అల్లరి నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘నాంది’. ఈ మూవీ యూనిట్‌లో రోజువారీ వేతనంతో జీవనం సాగించే కార్మికులకు ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు.
ఈ 21 రోజుల లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడే వారిలో తమ ‘నాంది’ చిత్ర యూనిట్ లో రోజువారీ వేతనంతో జీవనం సాగించే 50 మందికి పైగా కార్మికులు ఉన్నారని, వారు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలని చూస్తున్నామని అన్నారు. తమ నిర్మాత సతీశ్ వేగేశ్న, తాను కలిసి ఈ యాభై మందికి ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ‘ఇది గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నం కాదు.. సాటి మనిషికి సాయం చెయ్యడం మన కర్తవ్యం.. ఈ సాయం కావాలి మరిన్ని సాయాలకు నాంది..’ అంటూ ఓ ట్వీట్ చేశారు