HomeTelugu Newsఅన్ని రాజకీయ పార్టీలు శ్రీకాకుళాన్ని వాడుకున్నాయి: పవన్‌ కల్యాణ్‌

అన్ని రాజకీయ పార్టీలు శ్రీకాకుళాన్ని వాడుకున్నాయి: పవన్‌ కల్యాణ్‌

3 31రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి వరకూ శ్రీకాకుళాన్ని వాడుకున్నాయే తప్ప అభివృద్ధి చేయలేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కుటుంబ పాలనే నడుస్తోందని, అన్ని నియోజకవర్గాల్లో అధికారం రెండు వర్గాల మధ్యే నలుగుతోందని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో పవన్‌ ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాంతపు ఓట్లలో సైతం 60 శాతం ఓట్లు అచ్చెన్నాయుడు తీసుకుంటే, మిగతా 40 శాతం వైసీపీ తరపున ఉన్న ధర్మాన ప్రసాదరావుకు వెళ్తున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితి మారాలని పవన్‌ ఆకాంక్షించారు. తమ పార్టీ తరఫున ఒక్కో రంగానికి చెందిన వ్యక్తులను బరిలోకి దింపామని చెప్పారు. బీటెక్‌ చదువుకున్న కణితి కిరణ్‌కుమార్‌ను టెక్కలిలో, ఇచ్ఛాపురంలో దాసరి రాజును, రాజాంలో ముచ్చా శ్రీనివాసరావును ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టామని తెలిపారు. ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన ముచ్చా శ్రీనివాసరావు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజాంలో బరిలో నిలిచారని వివరించారు. కుటుంబ పాలనలో నలిగిపోతున్న శ్రీకాకుళాన్ని రక్షించాలనే తపనతో ఉన్న ఈ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

‘ఉత్తరాంధ్ర వెనకబాటు తనంపై మీకు కోపం లేదా? నాకు ఉంది. అల్లరి చిల్లరగా ఉన్న వాళ్ల వల్లే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఇక్కడ జనసేనకు సీట్లు రాకపోతే భవిష్యత్తులో పోరాటం చేసేవాళ్లు ఉండరు. తుపాను వచ్చినా పట్టించుకొనే వాళ్లు ఎవరూ ఉండరు. ఉత్తరాంధ్ర యాస, భాష, సంప్రదాయాన్ని గౌరవించిన వ్యక్తిని నేను.’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ సందర్భంగా తమ పార్టీ మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు. అవి…

* సంపాదనతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఆరు నుంచి పది సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.
* రేషన్‌ బియ్యం తీసేసి వాటి స్థానంలో ఆడపడుచుల ఖాతాల్లోకి నేరుగా రూ.2,500 నుంచి రూ.3,500 బదిలీ
* 60 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు రూ.5 వేలు పింఛను
* సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు దీర్ఘకాల వ్యవధిలో చూపు సమస్య వస్తుంది కాబట్టి నిర్దిష్ట వయసు దాటాక రూ.5 వేలు పింఛను, తుఫానుల సమయంలో మత్స్యకారులకు రోజుకు రూ.500 భృతి.
* పోటీ పరీక్షలు రాయాలనుకుంటున్న విద్యార్థులు అన్ని పరీక్షలకు ఫీజు చెల్లించనక్కర్లేకుండా అన్ని రకాల పరీక్షలకు కలిపి ఒకటే ఫీజు
* కాలేజీ విద్యార్థులకు ఉచిత బస్సు, రైలు పాస్‌తో సహా ఉచిత క్యాంటీన్‌ సౌకర్యం
* జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
* యువతకు ఉద్యోగ కల్పనకు 25 వేల ప్రత్యేక పోలీస్‌ కమాండో పోస్టుల భర్తీ. ఇందుకోసం వారికి ఆరు నుంచి 9 నెలల శిక్షణ
* ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) విధానం రద్దు, దాని స్థానంలో పాత పెన్షన్‌ విధానం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!