YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ములగపూడిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన వైఎస్ షర్మిల జగన్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజా సమస్యలపై జగన్‌కు అసలు పట్టింపు లేదని, యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు మద్య నిషేధం అమలు చేస్తానని జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేస్తోందని దుయ్యబట్టారు. కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం నిషేధిస్తేనే మళ్లీ ఓటు అడుగుతానన్న జగన్‌కు ఓటు అడిగే హక్కు లేదని తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా దండగ అన్నట్టు తయారైందని, రైతులు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను జగన్ పట్టించుకోలేదని, రైతులంటే జగన్‌కు ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే వారికి ఏం గౌరవం ఇచ్చినట్టు అని ప్రశ్నించారు. కనీసం పిల్లలకు ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం జగన్ ప్రతిపక్షంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము రండి అని చెప్పిన జగన్.. ఇప్పుడు సీఎంగా ఉన్నారు కదా మనకు 25 మంది ఎంపీలు ఉన్నారు మరి ఇప్పుడు ఎందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయలేదు అని షర్మిల సూటిగా ప్రశ్నించారు.
వైఎస్ జగన్ ఓ కుంభకర్ణుడిలా నిద్రపోయారని, మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని. ఎన్నికలకు 2 నెలల ముందు నిద్రలేచి 6 వేల ఉద్యోగాలతో డీఎస్సీ ప్రకటన చేశారని షర్మిల మండిపడ్డారు. ప్రజల గురించి జగన్ ఎప్పుడు ఆలోచన చేశారు.. మీరా వైఎస్ ఆశయాలను నిలబెట్టేది అంటూ ఎద్దేవా చేశారు. మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి కొడుకు అని చెప్పుకుంటున్న జగన్ మద్య నిషేధం చేస్తానని మాట ఎందుకు తప్పారని నిలదీశారు. మద్య నిషేధం లేకపోగా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం అమ్ముతోందని అన్నారు. జగన్ వాగ్దానాలన్నీ మద్యం షాపులో ఉన్నాయని వ్యంగ్యంగా అన్నారు.