దర్శకధీరుడు.. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. బాలీవుడ్ భామ ఆలియాభట్.. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. తాజాగా ఆమె తన ప్రియుడు రణబీర్ కపూర్‌తో పుట్‌బాల్ స్టేడియంలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆలియాభట్ ప్రస్తుతం బాలీవుడ్లో తెరకెక్కిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె రణబీర్‌కు జంటగా కనిపించనున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రీకరణ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారని నెటిజన్లు మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన రణబీర్.. ఆలియా తనకు చాలా స్పెషల్ అని చెప్పారు. అలాగే ఆలియా సైతం రణబీర్ అంటే చిన్నప్పటి నుంచి మంచి అభిప్రాయం ఉందని ఒకానొక సందర్భంలో తెలిపారు. దీంతో వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి.
ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం ముంబయిలో జరిగిన పుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు రణబీర్ – ఆలియా వచ్చారు. అంతేకాకుండా మ్యాచ్ జరుగుతున్న సమయంలో వీరిద్దరు చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ కనిపించారు. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నమాట వాస్తమేనంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సైతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.