స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీకి టైటిల్ ఖరారైంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించి తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. సినిమాకు ‘అల.. వైకుంఠపురములో’ అనే టైటిల్ నిర్ణయించారు. అంతేకాదు బన్నీ, మురళీ శర్మ మధ్య సాగే సన్నివేశాన్ని టీజర్ రూపంలో చూపించారు. అందులో బన్నీ మధ్య తరగతి యువకుడిలా కనిపించారు. ‘ఏంట్రోయ్.. గ్యాప్ ఇచ్చావు?’ అని మురళీ శర్మ ప్రశ్నిస్తే.. ‘ఇవ్వలా.. వచ్చింది’ అని బన్నీ ఎటకారంగా సమాధానం చెప్పే తీరు ఆకట్టుకుంది.
బన్నీ 19వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి హిట్ చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.