ఈ ఫొటో చుశారా.. అక్షయ్‌కుమార్‌కు మంటలు అంటుకున్నాయి అనుకుంటున్నారా? డూప్‌లతో పనిలేకుండా ఇలాంటి యాక్షన్ సీన్లు ఎన్నో చేశారు కాబట్టే ఆయన బాలీవుడ్ ఖిలాడీ అయ్యారు. ప్రస్తుతం పలు వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. త్వరలో ఆయన ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో అది ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రచారం కోసం ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ఒంటిపై మంటలు అంటించుకుని టైటిల్‌ను ప్రకటించారు.
సడెన్‌గా ఒంటిపై మంటలు అంటించుకున్న అక్షయ్ వేదిక పైకి వస్తుంటే సభికులందరూ ఆశ్చర్యపోయారు. నేరుగా వేదిక పైకి వచ్చిన ఆయన వెళ్తూ వెళ్తూ, అమెజాన్ స్టూడియోస్ హెడ్ జెన్నిఫర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లారు. ‘ఒంటికి మంటలు అంటించుకోవద్దని చాలా మంది అక్షయ్‌కు చెప్పారు. అది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఆయన ఎవరి మాట వినలేదు. ఇలాంటి ప్రమాదకర స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలను డూప్ లేకుండా ఆయన చేయడానికి ఇష్టపడతారు. అయితే, నిపుణుల పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న అక్షయ్ ఇలా శరీరానికి మంటలు అంటించుకున్నారు’ అని ఆయన సన్నిహితులు చెప్పారు.
‘ఈ ఏడాది చాలా సినిమాలను ఒప్పుకొన్నా. అస్సలు ఖాళీ లేదు. కానీ, కేవలం నా కుమారుడు ఆరవ్ కోసం నేను వెబ్ సిరీస్ చేయడానికి అంగీకారం తెలిపా. ఎందుకంటే ‘యువతకు చేరువయ్యేది వెబ్ సిరీస్‌ల ద్వారానే, మీరు కూడా ఏదైనా వెబ్ సిరీస్ చేయండి’ అని నన్ను అడిగాడు. అందుకే ఒప్పుకొన్నా’ అని అక్షయ్ చెప్పారు.
. @akshaykumar on 🔥 #AmazonPrime event pic.twitter.com/TI1zUzNGP7
— MR (@imrowdymayur) March 5, 2019