బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అసోంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రహ్మపుత్ర, సుబాన్‌సిరి, ధన్‌సిరి, జియాభరలి, కొపిలి, ధరామ్‌తుల్, పుతీమరి, బేకి, బరాక్, బాదర్‌పూర్ నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. గువహటి సహా దాదాపు 33 జిల్లాలు వరదల గుప్పిట్లో చిక్కుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 4620 గ్రామాలు నీటమునిగినట్లు అధికారులు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం అసోం ప్రభుత్వం 226 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది. లక్షా రెండు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోపక్క రాష్ట్రంలోని కజిరంగా జాతీయ ఉద్యానవనం దాదాపు 90 శాతం నీట మునిగింది. దీంతో అందులోని వన్యప్రాణాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి.
ఈ ప్రకృతి వైపరిత్యానికి అక్షయ్ చలించిపోయారు. తనవంతు సాయంగా అసోం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘అసోంలో వరదలు సృష్టించిన బీభత్సాన్ని చూసి నా హృదయం చలించిపోయింది. ఇలాంటి కష్ట సమయంలో బాధితులు, జంతువులకు మనం చేయూతగా ఉండాలి. నా వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి, జాతీయ ఉద్యానవనం సంరక్షణకు రూ.కోటి విరాళం ఇస్తున్నా. మీ వంతు సహాయం చేయండి’ అని ట్వీట్ చేశారు.