నందిత శ్వేతా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘‘అక్షర’’. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజర్ ను మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రిలీజ్ చేశారు. ఈ ‘ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. చిన్నికృష్ణ స్త్రీ పాత్రలను బలంగా రాయగలడు. విద్యా వ్యవస్థ పై ఆయన నలుగురితో పంచు కోవలనుకుంటున్న ఆలోచనలు… అందరినీ ఆలోచింపజేస్తాయని నమ్ముతున్నాను’ అంటున్నారు త్రివిక్రమ్. అఖిల విశ్వాన్ని శాసించే ఆది శక్తి అక్షరమే అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది.
విద్యా వ్యవస్థ ఎలా వ్యాపారమయం అయ్యిందో చూపించే కథతో సినిమా తీశారు. ఫీజుల కోసం, ర్యాంకుల కోసం కొన్ని ప్రైవేట్ కళాశాలలు చేస్తున్న అక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుందీ చిత్రం. ఫిజిక్స్ టీచర్ అక్షర పాత్రలో నందిత శ్వేతా కనిపించనుంది. విద్యార్థిని తండ్రిగా, ఈ విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా మాట్లాడే పాత్రలో హర్ష నటించారు. కాలేజ్ మాఫియాను నడిపించే పాత్రను సంజయ్ స్వరూప్ పోషించారు. పోలీస్ ఆఫీసర్ గా శత్రు కనిపించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కాబోతుంది.