నటి ఐశ్వర్యా రాజేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్, టాలీవుడ్ల్లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఐశ్వర్యా రాజేశ్ కిన్ స్లిన్ డైరెక్షన్లో ఓ చిత్రంలో క్యాబ్ డ్రైవర్ పాత్రను చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను గురువారం విడుదల చేశారు. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల చేయాలన్నది చిత్ర నిర్మాణ సంస్థ 18 రీల్స్ ఆలోచన. అన్ని భాషల్లోనూ దీనికి ‘డ్రైవర్ జమున’ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా డైరెక్టర్ కిన్ స్లిన్ మాట్లాడుతూ.. ‘ఐశ్వర్యా రాజేశ్ సినిమా అంటేనే సమ్ థింగ్ స్పెషల్ అనే భావన ప్రేక్షకులలో ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ కథను తయారు చేయడం జరిగింది. ఇవాళ టాక్సీ ఇండస్ట్రీ విశేషంగా పెరిగిపోయింది. క్యాబ్ డ్రైవర్లకు సంబంధించిన అంశాలను ఇందులో డీల్ చేస్తున్నాం. అందులోనూ ప్రత్యేకంగా ఓ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన లేడీ డ్రైవర్ జీవితాన్ని చూపించబోతున్నాం. ఈ క్రైమ్ థిల్లర్ కోసం తన శరీరాకృతిని మరింత దృఢం చేసుకోవడానికి ఐశ్వర్యా రాజేశ్ కృషి చేస్తోంది. అలానే క్యాబ్ డ్రైవర్స్ ను కలిసి, వారి బాడీ లాంగ్వేజ్ ను గమనించి, దానికి అనుగుణంగా తనని తాను మలుచుకునే ప్రయత్నం చేస్తోంది’ అని చెప్పారు.