పనామా పేపర్ల లీక్ కేసు బచ్చన్ కుటుంబానికి కష్టాలు తెచ్చిపెట్టాయి. ఈ వ్యవహారంలో నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈ రోజు(డిసెంబర్ 20) ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్‌లో తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశించినట్లు సమాచారం. ఈడీ ఆదేశాల ప్రకారం అధికారుల ముందు ఇవాళ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈడీ అధికారులు ప్రశ్నల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ పనామా పేపర్స్ కేసులో భారత్ నుంచి సుమారు 500 మందికి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇందులో నాయకులు, నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు.
ఈ కేసులో ప్రమేయం ఉన్నవారు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పనామా పేపర్ల కేసుపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈడీ అధికారులు దేశంలోని పలువురు ప్రముఖులను విచారణలో చేర్చారు. అందులో భాగంగా నెల రోజుల క్రితం అభిషేక్ బచ్చన్‌కు కూడా ఈడీ సమన‍్లు జారీ చేయగా అధికారుల ముందు హాజరయ్యారు. ఈడీ అధికారులకు అభిషేక్ కొన్ని పత్రాలను అందజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్‌కు సమన్లు జారీ కావడం చర్చనీయంగా మారింది.