విభిన్న కథాంశాలతో దక్షిణాదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. ఆమెకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. హీరోల సినిమాలకు పోటీగా ఆమె చిత్రాలు బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబడుతుంటాయి. అందుకే ఆమెను ‘లేడీ సూపర్‌స్టార్’ అంటుంటారు. నయన్ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘ఐరా’. సర్జున్ కేఎమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కలైయరసన్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో నయన్ గుర్తు పట్టలేని విధంగా కొత్త లుక్‌లో కనిపించారు. ఎంతో ఆసక్తికరంగా ఈ టీజర్‌ను రూపొందించారు.
‘మళ్లీ ఆడపిల్ల పుట్టింది రా.. అయ్యో ఆడపిల్లా..!’ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ‘నాకే తెలియని ఎవరో ఆరుగురు నా తలరాతను తలకిందులుగా రాశారు..’ అంటూ నయన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఓ పాత్రలో మోడ్రన్‌గా, ధైర్యంగా.. మరో పాత్రలో అమాయకంగా కనిపించారు. ‘అందరికీ సంతోషంగా బతకడం ఒక కళ.. కానీ జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలియని నాకు బతకడమే ఒక కళ’ అనే డైలాగ్‌తో టీజర్ ముగిసింది. నయన్ నటన మాత్రం హైలైట్‌గా నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా హారర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.