బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన మృతికి గల కారణాలను సుదీర్ఘంగా పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు ఈ రోజు తమ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆయన మృతదేహంలో ఎలాంటి విషం ఆనవాళ్లు లేవని అందులో స్పష్టం చేశారు. సుశాంత్ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడని తెలిపారు. ఆయన డీఎన్‌ఏను పూర్తిగా పరిశీలించామని, ఆ తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
సుశాంత్ మృతికి సంబంధించి గతంలో మహారాష్ట్ర వైద్యులు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నివేదికలో తేలిన అంశాలే తమ పరిశీలనలోనూ నిర్ధారణ అయ్యాయని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఆయన మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని వైద్యులు భావిస్తున్నారు. కాగా, సుశాంత్ ‘జూన్ 14న’ ముంబైలోని తన నివాసంలో మృతి చెందాడు. దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించారు.