డీప్ ఫేక్ వీడియోలు సెలబ్రిటీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక డీప్ ఫేక్ వీడియోల బెడద ఎక్కువైంది. కొద్దిరోజుల క్రితమే రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఎంతగానో కలకలం రేపింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. పలువురు సెలబ్రిటీలు దీనిపై స్పందించారు. పోలీసులు కూడా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజాగా మరో సెలబ్రిటీ డీప్ ఫేక్ బారిన పడింది. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అజయ్‌దేవగణ్ భార్య కాజోల్ డీప్ ఫేక్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కాజోల్ దుస్తులు మార్చుకుంటున్నట్టుగా ఉన్న వీడియో చాలా అభ్యంతరకరంగా ఉంది.
డీపే ఫేక్ టెక్నాలజీతో వేరే మహిళ వీడియోలో ఆమె ముఖాన్ని ఏఐ టెక్నాలజీతో తొలగించి కాజోల్ ముఖాన్ని యాడ్ చేశారు. టిక్‌టాక్‌లో ట్రెండ్‌గా మారిన గెట్ రెడీ విత్ మి వీడియోల్లో ఇది ఒకటి. కెమెరా ముందు బట్టలు మార్చుకుంటున్న వీడియో ఇది. టిక్ టాక్ స్టార్ రోజీ బీరీన్స్ ముఖం స్థానంలో కాజోల్ ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఈ డీప్ ఫేక్ వీడియో రూపొందించినట్టు తెలుస్తోంది.
ఈ తరహా వీడియోలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాకు సూచనలు చేసింది. అభ్యంతరకరమైన వీడియోలు, మెసేజ్‌లు రిపోర్ట్ చేసిన 36 గంటల్లోగా తొలగించాలని ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం కాజోల్ డీప్ ఫేక్ వీడియోపై ఆమె అభిమానులతో పాటు అజయ్ దేవగణ్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు.