యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘రామాయణం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ ను నెలాఖరులోగా కంప్లీట్ చేయాలని దర్శకుడు ఓం రౌత్ నిర్ణయించుకున్నారట. మంగళవారం ముంబైలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, కృతి సనన్ ఇద్దరూ పాల్గొనబోతున్నారు.
ఈ సినిమా షూటింగ్ మొదట్లో ముంబైలో ప్రారంభమైంది. అయితే కోవిడ్ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షల కారణంగా తర్వాత హైదరాబాద్‌కు షూటింగ్ ను మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు మూవీ యూనిట్ ముంబైకి చేరుకుంది. సినిమా షూటింగ్ మొత్తం స్టూడియోలలో జరుగుతోంది. క్రోమాను ఉపయోగించి షూటింగ్ చేస్తున్నారట. బ్యాక్ గ్రౌండ్ ను తరువాత యాడ్ చేస్తారని సమాచారం. హాలీవుడ్ నుండి వచ్చిన విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ సినిమాలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్‌లను క్రియేట్ చేయబోతున్నారట. నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించడానికి వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 2022 లో విడుదల కానుంది.