హీరోయిన్ పూర్ణ పోలీసులను ఆశ్రయించారు. పూర్ణను నలుగురు యువకులు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన కేరళ పోలీసులు ఆ నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను త్రిసూర్‌కు చెందిన శరత్, అష్రఫ్, రఫీక్, రమేశ్‌లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. అరెస్ట్ చేసిన నలుగురిని ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉంచినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు.
పూర్ణకు పెళ్లి సంబంధం తీసుకొచ్చామనే నెపంతో నిందితులు ఆమె ఇంటికి వచ్చినట్టుగా సమాచారం. వారిది కోజికోడ్ అని, పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులమని నిందితులు పూర్ణ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ తర్వాత వారు పూర్ణకు ఫోన్ చేసి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. లేకపోతే ఆమె కేరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించారు. దీంతో పూర్ణ తల్లి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు తమ ఇంటి పరిసరాల్లో తిరుగుతూ.. పూర్ణ ఫొటోలు తీస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్ణ హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, తెలుగులో అవును, అవును 2, సీమటపాకాయ్, జయమ్ము నిశ్చయమ్మురా.. వంటి చిత్రాల్లో నటించారు. పూర్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు పలు రియాల్టి షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు