సీనియర్ నటి పద్మ జయంతి తెలుగులో పలు సినిమాల్లో మనకు కనిపిస్తునే ఉంటుంది. దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించిన పద్మ జయంతి.. తల్లిగా.. వదినగా.. ఇతర పాత్రల్లో కనిపించింది. అయితే తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్పైన సీనియర్ నటులపైన షాకింగ్ కామెంట్స్ చేసింది.. తాను 350 చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు సరిగా గుర్తుపట్టడం లేదంటే.. తనని ఎదగనీయకుండా తొక్కేయడమే కారణం అంటూ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా పలువురి నటులపై సంచలన ఆరోపణలు చేసింది. దివంగత నటుడు, ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెస్ నారాయణ తనతో మిస్ బిహేవ్ చేసేవాడని, తాగిన మైకంలో తన చేయి పట్టుకుని గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారంటూ త్రీవ ఆరోపణలు చేసింది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెస్ నారాయణతో జరిగిన వివాదం ఏంటో వెల్లడించింది.
‘‘ఇండస్ట్రీలో తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నన్ను చాలామంది చాలా రకాలుగా హింసించారు. సీనియర్ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ గారు సెట్స్‌లోనే నాతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇద్దరం కలిసి ఓ సినిమా చేస్తున్నాం. మా అత్తగారు చనిపోయిన నెల రోజులకే నేను షూటింగ్‌కి వెళ్లాల్సి వచ్చింది. దాదాపు 22 మంది కమెడియన్లతో షూటింగ్ జరుగుతోంది. నేను సెట్‌లో కుర్చొని ఉండగా వెనుక నుంచి ఒకరు వచ్చి నా చేయి పట్టుకుని లాక్కుని వెళ్తున్నారు.. ఎవరా అని చూస్తే.. ఎమ్మెస్ నారాయణ గారు. ఆయన పర్సనాలిటీ నాలో సగం ఉంటుంది కానీ.. నన్ను పట్టుకుని లాక్కుపోతున్నారు. ఇదేంటి సార్ అంటే.. ఏం లేదు నీతో మాట్లాడే పని ఉంది. రా.. మాట్లాడాలి అని అన్నారు.
అప్పటికే ఆయన దగ్గర మందు వాసన వస్తుంది. సెట్‌కి తాగి వచ్చేశారు. తాగిన మైకంలో నన్ను చేయిపట్టుకుని గదిలోకి లాక్కుపోతున్నారు. ఇదేంటి సార్ అని అడిగితే.. నాతో అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో నేను సీరియస్ అయ్యాను. చేయి విడిపించుకొని ఎమ్మెస్ పీక పట్టుకొని పైకి లాగాను. దీంతో ఆయన గట్టిగా అరిచాడు. అందరూ వచ్చి నన్ను పక్కకి లాగారు. ఆయన పెద్ద కమెడియన్ అని, తనతో గొడవ పడితే నాకే ప్రాబ్లమ్ అవుతుందని సర్ధి చెప్పారు. కానీ ఇష్యూ పెద్దదైంది. నేను యూనియన్‌లో ఫిర్యాదు చేశాను. పెద్దలు వచ్చి మాట్లాడారు. అయితే ఆ పెద్దలే నాకు ఫోన్ చేసి నీకు లైఫ్ ఉండదని బెదిరించారు. అయినా నేను వెనక్కి తగ్గలేదు.
ఈరోజు నేను వదిలేస్తే.. నా వెనుక వేరే వాళ్లు బాధపడతారని అనుకున్నా.. కానీ నాకు ఆ పరిస్థితుల్లో ఒకటి అర్థం అయ్యింది మనకంటూ ఒక సపోర్ట్ కావాలి అని. సపోర్ట్ లేకపోతే ఎవడైనా అడ్వాంటేజ్ తీసుకుంటాడని అర్థమైంది. ఆ ఇష్యూతో దాదాపు 10 సినిమాల వరకూ పోయాయి. నటించకుండా చేశారు. చాలామంది బెదిరించారు. పొరపాటున ఏదైనా సినిమా చేస్తుంటే నిర్మాతకి చెప్పి క్యాన్సిల్ చేయించేవారు. ఆ తరువాత ఆ గొడవను ఇండస్ట్రీ మర్చిపోయింది. మెల్ల మెల్లగా నా సినిమాలు నేను చేసుకున్నాను’ అంటూ తనకు జరిగిన అన్యాయాన్ని పద్మ జయంతి చెప్పుకుంది.