మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, నటి జీవిత ‘సామాజిక బాధ్యతతో సినిమాలు తీయాలి. ‘అర్జున్‌రెడ్డి, ‘ఆర్ ఎక్స్ 100′ పుణ్యమా అని కళాశాల నేపథ్యం అనగానే ముద్దు సన్నివేశాలు తప్పనిసరి అన్న స్థాయికి మన సినిమా దిగజారియిపోయింది’ అన్నారు. ఆమె హైదరాబాద్‌లో జరిగిన ‘డిగ్రీ కాలేజ్’ ప్రచార చిత్రాల ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరుణ్, దివ్య జంటగా నటించిన చిత్రమిది. నరసింహ నంది దర్శకత్వం వహించారు. శ్రీలక్ష్మీనరసింహ సినిమా సంస్థ నిర్మించింది. ప్రచార చిత్రాల్ని ఆవిష్కరించిన అనంతరం జీవిత మాట్లాడుతూ ‘సినిమా అనేది అందరూ కలిసి చూసేది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే దర్శక నిర్మాతలు సినిమాలు తీయాలి. ప్రచార చిత్రాలు చూశాక నా అభిప్రాయం చెప్పదలచుకొన్నా. ప్రతి మనిషి జీవితంలో శృంగారం ఉంటుంది. కానీ అది గోప్యంగా ఉంటుంది. సినిమాల్లో శృంగారానికి కూడా పరిమితులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ చూడగలిగేలా తెరపైకి తీసుకొచ్చినప్పుడే అందం. హద్దులు దాటి చూపిస్తేనే సినిమా విజయం సాధిస్తుందను కోవడం పొరపాటు. ఏది మంచిదో, ఏది చెడో తెలుసుకోలేని వయసు యువతరానిది. సినిమాలు చూసి ఇలాగే ఉండాలేమో అని యువత అనుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నేనొక తల్లిగానే నా అభిప్రాయాన్ని చెప్పాను’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘1940లో ఓ గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’ వంటి కళాత్మక సినిమాల్ని నా కోసం తీశా. ఒక పత్రికలో ప్రచురితమైన వ్యాసం చదివాక నాలో కలిగిన బాధని ప్రేక్షకుల కోసం ఈ చిత్రంగా మలిచా. ఇందులో పది శాతమే శృంగారం. మిగతాదంతా నిజమైన ప్రేమకథే ఉంటుంది’ అన్నారు. ‘సందేశాలిస్తే ఎవరూ థియేటర్లకి రావడంలేదు. మాకు డబ్బులు రావడంలేదు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశాన్ని కమర్షియల్ కోణంలో ఈ ప్రేమకథ రూపంలో చూపించే ప్రయత్నం చేశారు. సునీల్ కశ్యప్ స్వరపరచిన ఆరు పాటలు అలరిస్తాయి. త్వరలో ఆడియో, సినిమాని విడుదల చేస్తామ’ ని సహనిర్మాతల్లో ఒకరైన శ్రీనివాసరావు చెప్పారు. కార్యక్రమంలో వరుణ్, రవిరెడ్డి, మదన్, కనకయ్య, కిషన్, బేబి సమంత తదితరులు పాల్గొన్నారు.
HomeTelugu Big Storiesఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయాలి.. 'డిగ్రీ కాలేజ్' ట్రైలర్ పై మండిపడ్డ జీవిత