మా అధ్యక్షుడు నరేశ్‌పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి హేమ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఎలక్షన్స్ పై స్పందించింది. ఈ సంవత్సరం ‘మా’ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడేలా కొంతమంది చూస్తున్నారని.. లేదా ఎన్నికలు లేకుండా నరేశ్‌నే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని హేమ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు మాత్రమే నరేశ్ ఇప్పటివరకూ ఖర్చు చేశారని.. మిగతావి ఏం చేశారని ప్రశ్నించింది. అధ్యక్ష పీఠం నుంచి దిగకుండా ఉండేందుకు నరేశ్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు శనివారం ఉదయం 200 మంది అసోసియేషన్ సభ్యులకు ఆమె లేఖలు రాసింది. ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష ఎన్నికలు జరిగేలా చూడాలంటూ వారందరి నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది.
‘మా’ అధ్యక్ష ఎన్నికలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నడూ లేనివిధంగా ఈసారి మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తన ప్యానల్‌ని ప్రకటించగా.. మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల తేదీని వెంటనే ప్రకటించాలని ఓ వైపు ప్రకాశ్‌రాజ్ కోరుతుండగా.. ఈ సారి ఎన్నికలు ఏకగ్రీవం కావాలనుకుంటున్నట్లు విష్ణు పలు ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ క్రమంలోనే గత కొన్నిరోజుల నుంచి సైలెంట్‌గా ఉన్న హేమ ఉన్నట్లుండి అధ్యక్షుడు నరేశ్‌పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.