‘మా’ ఎన్నికల నేపథ్యంలో నిత్యం ఎదో వివాదం తెరపైకి వస్తోంది. ఒకవైపు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్, మరోవైపు మంచు విష్ణు ప్యానెల్ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సినీ నటి హేమ ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్, నటి కరాటే కళ్యాణిలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
‘‘ఈ నెల 10న జరుగుతున్న ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న నాపై కుమారి కళ్యాణి అలియాస్ కరాటే కళ్యాణి, వి.నరేశ్‌లు కొన్ని అవాంఛితమైన, పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలతో ఒక వీడియోను విడుదల చేశారు. సినీ రంగానికి చెందిన నటీమణుల ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటికి అసభ్యకరమైన వ్యాఖ్యలను జోడించి, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో ఈ విషయమై నేను సైబర్‌సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆ తరువాత ఇలాంటి ఘటనలు తగ్గాయి. తాజాగా ఆ ఘటనకు సంబంధించిన విషయాన్ని కళ్యాణి ప్రస్తావిస్తూ ‘నేను పోలీసుల వద్దకు వెళ్లినప్పుడు వారు నాకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన ఫొటోలను ముందుగా సోషల్‌మీడియా నుంచి తొలగించమని సలహా ఇచ్చినట్లు’ వ్యాఖ్యానించారు. కళ్యాణి వ్యాఖ్యలను నరేశ్ కూడా సమర్థించారు. నేను అమర్యాదకరమైన ఫొటోలను గ్రూపుల్లో పెట్టి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్లు కూడా తాజా వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా అందుకు ఆధారాలున్నాయని, వాటిని బయటపెడతామని బెదిరించారు. నరేశ్ వైఖరి నన్ను అగౌరవ పరిచేలా, నా వ్యక్తిత్వాన్ని కించరిచేలా ఉంది. నాపై అసభ్యకరమైన ప్రచారాలు చేయకుండా కట్టడి చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. మా ఎన్నికల ప్రచార సమయంలో సంస్థ ప్రతిష్ఠ దిగజారకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులందరిపైనా ఉంది. వీరి వల్ల సంస్థకు చెడ్డ పేరు రావటమే కాకుండా, కొందరు సభ్యులు కూడా వీరి ధోరణిని అనుసరించే ప్రమాదం ఉంది. అందువల్ల వారికి ఈసారి ఓటు హక్కు లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకొమ్మని కోరుతున్నా. కృతజ్ఞతలతో హేమ’’ అని లేఖలో పేర్కొన్నారు.
తనపై నరేశ్, కళ్యాణిలు చేసిన వ్యాఖ్యల వీడియోలను తొలగించాల్సిందిగా ఆయా యూట్యూబ్ యాజమాన్యాల పైనా సైబర్ క్రైమ్ పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు హేమ తెలిపారు.