HomeTelugu Big Storiesప్రముఖ నటుడు రాళ్లపల్లి కన్నుమూత

ప్రముఖ నటుడు రాళ్లపల్లి కన్నుమూత

8 13

ప్రముఖ సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు (73) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఈ రోజు తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కళాకారుడు ఎప్పుడూ నిత్యవిద్యార్థే అని చెప్పే రాళ్లపల్లి 1960లో ముఖానికి రంగులు వేసుకొని నటనా జీవితానికి శ్రీకారం చుట్టారు. అనంతరం 1974లో ‘స్త్రీ’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి.. శుభలేఖ, ఖైదీ, ఆలయ శిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, న్యాయానికి సంకెళ్లు, ఏప్రిల్‌ 1 విడుదల, సూర్య ఐపీఎస్‌, దొంగపోలీసు, కన్నయ్య కిట్టయ్య, సుందరకాండ, భలే భలే మగాడివోయ్‌ తదితర 850కి పైగా చిత్రాల్లో నటించారు. 1945 ఆగస్టు 15న అనంతపురం జిల్లా కంబదూరులో జన్మించిన రాళ్లపల్లికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె మృతి చెందగా.. మరో అమ్మాయి అమెరికాలో ఉంటున్నారు. రాళ్లపల్లి భౌతికకాయాన్ని నిమ్స్‌లోని మార్చురీకి తరలించారు. అమెరికా నుంచి ఆయన కుమార్తె వచ్చేంత వరకు అక్కడే ఉంచనున్నారు.

8a 1

తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందిన రాళ్లపల్లి.. సినీ ప్రస్థానంలో తన విలక్షణమైన నటనతో ఐదు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. దాదాపు 3 దశాబ్దాలకుపైగా సినీ పరిశ్రమకు ఆయన విశేష సేవలందించారు. మణిరత్నం దర్శకత్వంలోని బొంబాయి చిత్రంలో హిజ్రాగా నటించి ఔరా అన్పించారు. రాళ్లపల్లికి విద్యార్థి దశ నుంచే నాటకాల పట్ల ఎంతో మక్కువ. ఆ ఇష్టంతోనే 1974లో సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు 8వేలకు పైగా నాటకాల్లో నటించిన ఆయన చాలా భాగం నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించారు. కేవలం హాస్య నటుడిగానే కాకుండా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాళ్లపల్లికి చిల్లరదేవుళ్లు, చలిచీమలు వంటి చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. జంధ్యాల, వంశీ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రాళ్లపల్లి ఎంఫిల్‌ చేస్తున్నారు. రాళ్లపల్లి మృతిపట్ల తెలుగు చిత్రపరిశ్రమ ప్రముఖులు, సినీ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu